మేడ్చల్, మే 17(నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్ జిల్లావ్యాప్తంగా కొనాల్సిన ధాన్యం 20 వేల మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటి వరకు 5 వేల 15 వేల మెట్రిక్ ధాన్యం మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అయితే ధాన్యం కొనుగోళ్లలో అధికారులు ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు మారి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం తడిసిన పరిస్థితులు వచ్చాయని ఆవేదన చెందుతున్నారు. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు అన్నదాతలు పేర్కొంటున్నారు.
జిల్లాలో యాసంగిలో 13,125 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, 20 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుందని అంచనా వేశారు. అయితే, ఇప్పటి వరకు 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. గురువారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో ధాన్యం కొనుగోలు తీరుపై సభ్యులు నిలదీశారు. ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులుపడుతున్నట్లు చెప్పారు. ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇటీవల కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసిపోయిందని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా.. ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లి.. ధాన్యం కొన్నాం. అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు వస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించి ధాన్యాన్ని కొనాలి.
-డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి