శంషాబాద్ రూరల్, జనవరి 30 : ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి నేరుగా కొడంగల్ వరకు రేడియల్ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి రెవెన్యూ అధికారులు భూముల సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే పనులను శుక్రవారం మండలంలోని కోత్వాల్‌గూడ వద్ద రైతులు, నాయకులు అడ్డుకున్నారు. రేడియల్ రోడ్డు వద్ద తమ భూములు తమకే కావాలని డిమాండ్ చేస్తూ మహిళా రైతులు సైతం నినాదాలు చేశారు.
వారు మాట్లాడుతూ కోత్వాల్‌గూడ రెవెన్యూ పరిధిలో పేద రైతులకు చెందిన 53ఎకరాల ౩౩ గుంటల భూమి పోతుందని అన్నారు. వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్న తమ భూములను లాక్కుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సర్వేను అడ్డుకున్న వారిలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఉప సర్పంచ్ శేఖర్‌గుప్తా,బీఆర్ఎస్ నాయకుడు గుండిచరణ్, గుంటిబాలు, గ్రామస్తులు రాజిరెడ్డి, నాగరాజు, శ్రీను, చాకలి యాదయ్య,శివకుమార్,శాతం శ్రీను ఉన్నారు.