కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుండే. కరెంటు సరిగా రాక ఎవుసం సరిగా నడవకుంటుండే. రాత్రి ఇచ్చే 3 గంటల కరెంటుతో ఎన్నో కష్టాలు పడ్డాం. పురుగు, బూసికి భయపడుతూ రాత్రింభవళ్లు పొలాలను పారబెట్టినం. ప్రమాదాలకు గురైనం. అప్పటి రోజులు కండ్లముందే కనిపిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల మాటలు వింటుంటే గత పాలన రోజులు గుర్తుకొస్తున్నాయని రైతులు వాపోతున్నారు. కాంగ్రెస్ నాయకులు తాము అధికారంలోకి రాగానే 3 గంటల కరెంటు, 10 హెచ్‌పీ మోటర్లు పెడుతామని, ధరణిని తీసేస్తామని అంటున్నరు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ రైతాంగం కన్నెర్ర జేస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పండుగ చేసింది. 24 గంటల కరెంటు, రైతుబంధుతో సంబురంగా సాగు చేస్తున్నామని రైతులు చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ బావుల దగ్గర కరెంట్ కోసం కాపు కాచే రోజులు వస్తాయి. రైతుల సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే తమ మద్దతు.. అని రైతులు ప్రకటిస్తున్నారు.
కాంగ్రెస్‌ను కాటిలో కలుపుడే..
ధరణిని రద్దు చేస్తామన్న కాంగ్రెస్‌ను కాటిలో కలుపుడే. రైతుల భూములు భద్రంగా ఉండాలని సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చి రక్షణ కల్పించారు. కాంగ్రెస్ పాలనలో పట్వారీ వ్యవస్థతో భూములు తారుమారయినవి. పట్టా కోసం అధికారుల వద్దకు వెళ్తే అప్పుడు చేద్దాం.. ఇప్పుడు చేద్దామంటూ కాలం వెళ్లదీసి రైతులను ముప్పుతిప్పలు పెట్టేవారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ధరణితో గుంట భూమి కూడా చిక్కులు లేకుండా సక్కగా ఉంది. కేసీఆర్ సార్ రైతులకు పంట పెట్టుబడి సాయం అందజేసి కడుపులో పెట్టి చూసుకుంటండు. రైతులకు మేలు చేస్తున్న సీఎం కేసీఆర్ వెంటే మేమంతా ఉంటాం.
– జక్కుల నర్సింహులు, రైతు, అంబేద్కర్‌నగర్
ధరణితోనే రైతులకు ధైర్యం..
రైతాంగానికి భరోసా తీసుకొచ్చిందే ధరణి. గతంలో ఏ రికార్డు కావాలన్నా అధికారులు, ఆఫీసుల చుట్టూ తిరుగాల్సిన పరిస్థితి. అదే ధరణి వచ్చిన తర్వాత ఎవ్వరికి సలాం కొట్టాల్సిన అవసరమే రాలేదు. ఆన్లైన్లో ఒక్క బటన్ నొక్కితే మన పొలం ఎక్కడుంది , ఎంతుంది మొత్తం తెలిసిపోతది. రైతులకు ఇంతకంటే భరోసా ఏముంటది. నా వేలి ముద్రలేకుండా నా భూమి ఎవ్వరు తీసుకోలేరు. సీఎం కేసీఆర్ రైతాంగానికి కొండంత అండగా ఉన్నడు. ఒక్కరోజే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ జరుగుతున్నాయి. మా మద్దతు బీఆర్ఎస్ ప్రభుత్వానికే.
– పొలమొల్ల అశోక్, శామీర్‌పేట మండలం
కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆగమవుతం
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రైతుల బతుకులు ఆగమవుతాయి. 24 గంటల కరెంట్‌తో మంచిగా పంటలు పడించుకుంటున్నం. రైతుబంధు అందుతున్నది. పండిన వడ్లను ప్రభుత్వమే మద్దతు ధరకు కొంటోంది. ఇంకేం కావాలి. కాంగ్రెస్ వచ్చి 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలి, 3 గంటల కరెంట్ ఇస్తామంటే అంతే సంగతులు. రైతుల బతుకులు ఆగమవుతాయి. అసలు 3 గంటల కరెంట్‌తో పండుతాయా? వ్యసాయం చేసిన ముఖమేనా? కాంగ్రెస్‌ను గెలిపించుకుంటే మోటర్లు, ట్రాన్స్పార్మర్లు కాలిపోయిన రోజులు మళ్లీ రావడం ఖాయం.
– ఎలిజాల ఐలేశ్ గౌడ్, రాంపల్లి, నాగారం
వ్యవసాయం ఖతమైతది..
కాంగ్రెస్ వస్తే ధరణిని ఎత్తేస్తమంటున్నది. మళ్లీ పాత రెవెన్యూ వ్యవస్తను తీసుకువచ్చి ఆఫీసుల చుట్టూ తిప్పుతరా? గతంలో రెవెన్యూ రికార్డులు సరిగా లేక రైతులు పడ్డ గోస అంత ఇంతకాదు. పాత విధానం అంటే వ్యవసాయం ఖతమైతది. సీఎం కేసీఆర్ వచ్చినంక ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతుల ఇబ్బందులను దూరం చేసిండు. పహణీలు, రికార్డుల బాధ తప్పింది. మా భూమి ఎవ్వరి పేరు మీదికి మారుతదో అనే భయం అసలే లేదు. ఎందుకంటే రైతులు వేలు ముద్ర వేస్తే తప్ప మారదు. ధరణి ఎప్పుడైతే వచ్చిందో రైతులకు ధైర్యం పెరిగింది. భూమి మీద సర్వ హక్కులు వచ్చాయి, భరోసా వచ్చింది. ధరణితోటి టైంకు రైతుబంధు, రైతులు కాలం చేస్తే రైతుబీమా వారంలోపు పడుతుందంటే అది ధరణితోనే సాధ్యమైంది. మంచి చేస్తున్న ప్రభుత్వానికే అండగా ఉంటాం.
– వంగ భూమిరెడ్డి, శామీర్‌పేట సొసైటీ డైరెక్టర్
కాంగ్రెస్ కాలంలో కండ్లు లొట్టలు పోయాయి..
కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎప్పుడు వస్తుందో తెలవని దుస్థితి ఉండే. కరెంటు కోసం కండ్లు లొట్టలు పడేలా చూసినం. రాత్రి పూట బాయికాడికి పోయి ప్రమాదాలకు గురయ్యాం. కరెంటు కోతలతో ఉన్న ఎకరం పొలం పారక పంట ఎండిపోయింది. సీఎం కేసీఆర్ వచ్చినంక వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నడు. కాంగ్రెస్ వస్తే 3గంటలు కరెంటిస్తే పొలం పారదు. రైతు ఆత్మహత్యలు పెరుగుతాయి. 10హెచ్‌పీ మోటర్లు ఖర్చుతో కూడుకున్న పని. రైతులకు ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా సరఫరా చేస్తున్న బీఆర్ఎస్కే మా రైతులమంతా మద్దతుగా ఉంటాం.
– ఆకుల పోచయ్య, రైతు, బీజేఆర్నగర్
ధరణి ఎత్తేస్తే దళారుల రాజ్యమే..
ధరణి వచ్చినంక రైతులకు భూముల భయం పోయింది. గత పదేండ్ల కింద రికార్డుల్లో పేర్లు మారుతుండటంతో ఎప్పుడు ఎవరి పేరు మీద భూమి మారుతుందో అనే భయంగా ఉండేటోళ్లం. కాంగ్రెస్ ధరణిని తీసేస్తే దళారుల రాజ్యమొస్తది. పాత వ్యవస్థను మళ్లీ తీసుకొస్తే రైతులు ఆగమవుతరు. గతంలో రికార్డులను సరి చేసుకోవడానికి అధికారుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడినం. పనులు అవ్వలేదు. అన్ని విధాలా నష్టపోయినం. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో భయం పోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్లైన్లో పేరు, భూ వివరాలను చూసుకుంటున్నాం.
– ఎం. దేవేందర్‌రెడ్డి, బండమాదారం, మేడ్చల్ మండలం
ధరణితో భూ రికార్డులు భద్రం
ధరణిని ఏర్పాటు చేసినంక భూ రికార్డులు పకడ్బందీగా ఉన్నాయి. ఈ వ్యవస్థను రద్దు చేస్తామని కాంగ్రెస్ అంటున్నది. మళ్లీ పాత రోజులను గుర్తు చేస్తున్నారు. గతంలో ఉన్న రికార్డుల్లో విస్తీర్ణం మారేదని, రికార్డులు చూసుకోలేని వారు ఇబ్బందుల పాలయ్యారు. భూమి అమ్మాలన్నా, కొనాలన్నా ధరణి పోర్టల్‌తో భూ రిజిస్ర్టేషన్ సులభంగా అవుతున్నది. ఒక్కసారి భూమి పట్టా పాసుబుక్కులో పేరు వచ్చిందంటే బేఫికర్‌గా ఉంటున్నాం. గతంలో మాదిరిగా మాటి మాటికి రికార్డులు, పహణీలు చూసుకునే కష్టం తప్పింది.
– కే.రఘుపతిరెడ్డి. రాయిలాపూర్ గ్రామం, మేడ్చల్ మండలం