కీసర, జనవరి 18; తమది ప్రజాపాలన అని గొప్పగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కారు..ఆరుగాలం శ్రమించే రైతన్నలపైనే కక్ష గట్టింది. నెలా నెలా చెల్లించే 30 రూపాయల సర్వీస్ చార్జి కట్టలేదని చెప్పాపెట్టకుండా రైతుల పొలాలకు కరెంట్ కట్ చేసింది. గ్రామస్తులందరూ ఆ డబ్బులు ఇచ్చేవరకు కరెంటు సరఫరా చేయబోమని తేల్చి చెప్పింది. ఇదంతా ఎక్కడో కాదు.. నగరశివారులోని గ్రామంలో జరిగింది. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని భోగారం గ్రామంలో రైతుల వద్ద నుంచి సర్వీస్ చార్జి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.
అయితే ఇందుకు సంబంధించి రైతులతో సంప్రదించి వసూలు చేసుకోవాల్సిన అధికారులు ఏకపక్షంగా ఎలాంటి నోటీసులు లేకుండా ట్రాన్స్ఫార్మర్ల నుంచి భోగారం గ్రామస్తుల పొలాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. నీళ్లందక అటు పొలాలు ఎండిపోవడంతో పాటు మూగజీవులు కూడా దూప గొని అలమటిస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఏఈ మురళీకృష్ణ వివరణ ఇస్తూ భోగారం రైతుల నుంచి కోటిన్నర రూపాయల వరకు బిల్లులు రావాల్సి ఉందని అప్పటివరకు వారికి కరెంటు సరఫరా చేయబోమని తేల్చి చెప్పారు. కాగా నిరుపేద రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని భోగారం గ్రామ మాజీ సర్పంచ్ రాగి రాఘవేంద్రారెడ్డి హెచ్చరించారు.
రేవంత్రెడ్డి సర్కార్ వచ్చినప్పటినుంచే రైతుల జీవితాలు దుర్భరంగా మారిపోయాయని, రైతులకు ఇవ్వాల్సిన రుణామాఫీ, రైతు భరోసాతో రైతులకు సరిపడి విత్తనాలు, రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాలుగా రైతులను తన కడుపులో పెట్టుకొని దాచుకున్నాడని రైతులను రారాజులుగా చూశాడని గుర్తు చేశారు. రైతులను ఇలాగే ఇబ్బందులకు గురిచేస్తే పెద్ద ఎత్తున్న రైతులతో కీసరలోని కరెంట్ ఆఫీసును ముట్టడిస్తామన్నారు.