కందుకూరు, ఆగస్టు 28: రాష్ట్రంలో యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఎండ, వాన అనే తేడా లేకుండా బస్తాడు యూరియా కోసం పీఏసీఎస్‌ల ఎదుట కిలో మీటర్ల కొద్దీ క్యూలైన్లో వేచి చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఇటీవల వేసిన మొక్క జొన్న పంటలకు యూరియా అవసరం ఉండటంతో రైతులు వారం రోజులుగా పీఏసీఎస్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా నో స్టాకు బోర్డు ఉండటంతో నిరాశగా వెళ్లిపోతున్నారు.
కాగా, లారీ వచ్చినట్లు సమాచారం అందుకున్న రైతులు ఉదయం 6గంటల నుంచి లైన్లు కట్టారు. 400 సంచులు అవసరం ఉండగా 400 బస్తాలు మాత్రమే రావడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. దీంతో పోలీసులు కల్పించుకొని టోకెన్లు ఇచ్చి పంపడానికి ప్రయత్నించిగా వారి మాటలను సైతం రైతులు ఒప్పుకోక పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తమకు సరిపడా యూరియాను తెప్పించాలని పట్టుబట్టారు. కాసేపు అధికారులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. చివరికి పోలీసులే టోకెన్లు ఇచ్చి రైతులను పంపించారు.
పదిరోజులుగా తిరుగుతున్నాను
ఇప్పటికే మాకు రైతుబంధు నిధులను కాంగ్రెస్ సర్కార్ నిలిపివేసింది. దీనికి తోడు వేసిన పంటలకు యూరియా అడిగితే ఇవ్వడం లేదు. ఇదేం పాలన, ఇంతకుముందు యూరియా కష్టాలు రాలేదు. 10రోజుల నుంచి యూరియా బస్తాలకు తిరుగుతున్నాను.. ఒక్క బస్తా కూడా దొరుక లేదు.
– కళమ్మ , మహిళా రైతు, బాచుపల్లి
కేసీఆర్ పాలనే బాగుండే..
ఉదయం ఆరు గంటలకు వచ్చి లైన్లో నిలబడిన. అయినా కూడ బస్తా యూరియా కూడా దొరుక లేదు. కేవలం టోకెన్ ఇచ్చి పంపిస్తున్నారు. అధికారులును అడుగుదామంటే పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్ పాలన బాగుండే ఒక్క నాడు కూడా యూరియా సమస్య రాలేదు.
– సత్తమ్మ, నేదునూరు