విదేశాల్లో అక్కడి ప్రజలు, ప్రభుత్వం తిరస్కరణకు గురైన కంపెనీలను పెట్టుబడుల పేరిట ఇక్కడికి తీసుకొచ్చి ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ‘ఫార్మా సిటీ భూముల్లో ఏం జరుగుతోంది?’ అనే అంశంపై హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి నమూనా రైతులను ఆగం చేసి, వ్యవసాయాన్ని నాశనం చేస్తున్నదని ఆరోపించారు. ఫార్మాసిటీ ఏర్పాటు చేసేందుకు తీసుకున్న భూములను తిరిగి రైతులకు అప్పగిస్తామని ఇచ్చిన హామీలపై బాధితులు నిలదీస్తున్నారని, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు. రైతుల భూములను రక్షించేందుకు ఉమ్మడిగా పోరాటాలు చేయాలన్నారు. ప్రముఖ పర్యావరణవేత్త బాబురావు, జస్టిస్ చంద్రకుమార్, సామాజిక కార్యకర్తలు కన్నెగంటి రవి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
– సిటీబ్యూరో
సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): ‘ఫార్మా సిటీ భూముల్లో ఏం జరుగుతోంది?’ అనే అంశంపై హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అధికారంలోకి రాకముందు అండగా ఉంటామని చెప్పిన కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు నిలువునా ముంచారని ఫార్మాసిటీ భూ బాధితులు ఆరోపించారు. ఎన్నికల ముందు తమ ఇండ్ల వద్దకు వచ్చి గ్రీన్ ఫార్మా సిటీని రద్దుచేసి తమ భూములను వెనక్కి తిరిగి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారన్నారు. రైతుల భూములను కాపాడుతామని హామీ ఇచ్చి, ఇప్పుడు అవే భూములను ఫ్యూచర్ సిటీ పేరిట కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూములు ఇప్పిస్తామంటూ..
గ్రీన్ ఫార్మా సిటీని రద్దు చేసి మా భూములను మాకు ఇప్పిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పెద్దలంతా మా వద్దకు వచ్చి వాగ్దానాలు ఇచ్చారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి భూములను తిరిగిచ్చే బాధ్యత మాదేనని కుండబద్దలు కొట్టి చెప్పిండ్రు. భూముల కోసం 60 రోజులుగా రైతులు దీక్ష చేస్తుంటే.. ఇప్పుడు వాళ్లలో ఒక్కరూ కూడా ఇటువైపు తొంగి చూడటం లేదు. ఎన్నికల ముందు మమ్మల్ని నమ్మించి, ఇప్పుడు గెలిచి అధికారంలోకి రాగానే నట్టేట ముంచారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా కంపెనీలకు మా భూములను అప్పగించేందుకు కంకణం కట్టుకున్నారు. మా భూములను లాక్కొంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తాం.
-అనంత్‌రెడ్డి, నానక్‌నగర్