Rythu Dharna | కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే గడిచిన ఏడాది కాలంలో అనేక ధర్నాలు, నిరసన దీక్షలతో ప్రజలు, రైతుల పక్షాన నిలబడిన బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడిక్కడ ఎండగడుతున్నది. అధికారం కోసం అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగడుగునా నిలదీసుకుంటూ వస్తున్నది. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు కాకపోవడంతో అన్నదాతలు ఆవేదనకు గురవుతున్న నేపథ్యంలో రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమానికి తెరలేపింది. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా, నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా శుక్రవారం రంగారెడ్డిజిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్‌లో నిర్వహించే రైతు ధర్నా కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ యువనేత పట్నం అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ రైతు ధర్నా కార్యక్రమ ఏర్పాట్లను కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువనేత పట్లోళ్ళ కార్తీక్‌రెడ్డి దగ్గరుండి చూసుకుంటున్నారు. రైతులను, ప్రజలను, బీఆర్ఎస్ శ్రేణులను పెద్దఎత్తున తీసుకువచ్చి కేటీఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు.
– షాబాద్, జనవరి 16
రుణమాఫీ జరిగింది 35 శాతమే..
చేవెళ్ల రూరల్, జనవరి 16 : రాష్ట్రంలో 35 శాతానికి మించి రైతు రుణమాఫీ జరుగలేదని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం చేవెళ్ల మండల పరిధి కేసారం గ్రామ రెవెన్యూలోని బృందావన్ కాలనీలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నం మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ఇచ్చారని, గ్యారంటీ కార్డులు కొట్టించి మరీ కాంగ్రెస్ నేతలు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక ఉచిత బస్సు తప్పా ఏ హామీలూ అమలు కాలేదని మండిపడ్డారు. ఆగస్టు 15న బహిరంగ సభలో రుణమాఫీ పూర్తయినట్లు ప్రకటించారని, కానీ ఇప్పటివరకు ఏ గ్రామంలోనూ 35 శాతానికి మించలేదని విమర్శించారు.
అంతకుముందు మంత్రులు ఒకసారి రూ.46 వేల కోట్లని, కేబినేట్ మీటింగ్ పెట్టి రూ.42 వేల కోట్లని, మరోసారి రూ.26 వేల కోట్లని మూడు రకాలుగా మాట్లాడారని మండిపడ్డారు. చివరికి రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని ప్రకటించి.. రైతుల అకౌంట్లలో రూ.7 వేల కోట్లే జమ చేశారని ఆరోపించారు. తాను గతంలో ప్రాతినిథ్యం వహించిన కొడంగల్ నియోజకవర్గంలోని ఏ గ్రామమైనా తీసుకొని గ్రామ సభ పెట్టి హామీలపై చర్చిద్దామని సీఎం రేవంత్‌రెడ్డికి చాలెంజ్ చేశానని గుర్తుచేశారు. కనీసం 40 శాతం హామీలన్నా అమలైనట్లు తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించానని, అయినా సీఎంకు చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. కేసీఆర్ ఎకరాకు రూ.5 వేలు ఇస్తే రేవంత్‌రెడ్డి రూ.7,500 ఇస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు రూ.5 వేలకు కూడా దికులేదని ఎద్దేవా చేశారు. రైతు బంధు, రుణమాఫీ, 4వేల పింఛన్, తులం బంగారం ఇలా ఏ హామీ అమలు కావడం లేదన్నారు.
రైతుల తరపున కొట్లాడబోతున్నాం
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ నుంచి ప్రారంభం కానున్న రైతు దీక్షలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతాయని ప్రకటించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, రైతుల తరపున కొట్లాడాలని మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన కార్యక్రమం కాబట్టి భారీ ఎత్తున తరలిరావాలని కోరారు. చేవెళ్లకు ఒక చరిత్ర ఉందని, ఏ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా ఇకడి నుంచి మొదలు పెడితే సక్సెస్ అవుతుందన్నారు. రైతుల తరపున కొట్లాడబోతున్నాం కాబట్టి తప్పకుండా విజయం చేకూరుతుదని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ చేవెళ్ల, శంకర్పల్లి మండల అధ్యక్షుడు ప్రభాకర్, గోవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు శ్రీధర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి దేశమోళ్ల ఆంజనేయులు, షాబాద్ మాజీ జడ్పీటీసీ అవినాశ్‌రెడ్డి, సీనియర్ నాయకులు విఘ్నేశ్ గౌడ్, శేఖర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, భరత్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, రామాగౌడ్, నర్సింహులు, కెప్టెన్ అంజన్‌గౌడ్, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు అబ్దుల్ఘనీ, మాజీ ఎంపీటీసీ ఎల్లన్న, బీఆర్ఎస్ నాయకులు సత్యం, జంగారెడ్డి, వీరాంజనేయులు, నవీన్, వీరస్వామి, నర్సింహులు, సుదర్శన్, ఆసిఫ్ పాల్గొన్నారు.
రైతు ధర్నాలో పాల్గొననున్న కేటీఆర్
షాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే రైతుధర్నాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే ఈ రైతు నిరసన దీక్షలో కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితరులు హాజరుకానున్నారు. ఇప్పటికే అప్పా జంక్షన్ నుంచి షాబాద్ వరకు కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. రైతు ధర్నాలో పాల్గొనే అన్నదాతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
అన్నదాతల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం
రాష్ట్రంలో రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కాలంలో రైతుల పక్షాన ధర్నాలు, దీక్షలు నిర్వహించి అండగా నిలుస్తున్నది. రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గతేడాది ఆగస్టులో చేవెళ్లలో నిర్వహించిన రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ప్రస్తుతం రైతులకు ఇప్పటికే వానకాలం రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టిన ప్రభుత్వం.. యాసంగి పంటకు అనేక కొర్రీలు పెట్టి రైతు భరోసా అందిస్తామని ప్రకటనలు చేయడంతో రైతుల పక్షాన మరోసారి బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అదునుకు రెండు పంటలకు రైతు బంధు డబ్బులు అందించడంతో ఎవరిపైనా ఆధారపడకుండా రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకునేవాళ్లని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతుండడంతో వారికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి ముందుకు వెళ్తున్నది.