శంషాబాద్ రూరల్, జూన్ 26 : రెవెన్యూ అధికారులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ.. బుధవారం ఓ రైతు శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించడం కలకలం సృష్టించింది. బాధిత రైతు సురేశ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మండలం శంకరాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మయ్య- కమలమ్మకు ఘాన్సీమియాగూడ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 4/7, 4/8 లో 8 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నది. గతంలో పట్టాభూమిగా ఉన్న ఈ స్థలం ప్రస్తుతం సీలింగ్‌గా మార్చడంతో రైతు బంధు, రైతు బీమా పథకాలు రావడం లేదని వీరి కుమారుడు సురేశ్‌బాబు తెలిపారు. 9 నెలల కిందట తన తల్లి కమలమ్మ పేరున ఉన్న భూమి రికార్డులు ధరణిలో తప్పుగా వచ్చిందన్నారు. దీంతో తాము తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నామని, అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారులు మా సమస్యను పరిష్కరించడం లేదంటూ సురేశ్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సురేశ్‌బాబు అత్మహత్యకు యత్నించడంతో ఒక్కసారిగా శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. ఆర్జీఐఏ సీఐ బాలరాజు తన సిబ్బందితో చేరుకొని సురేశ్‌బాబుకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. కాగా, ఈ విషయంపై రెవెన్యూ అధికారులు మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు.