సిటీబ్యూరో, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ): నగరశివారులో ఫామ్ప్లాట్ల పేరిట అమ్మకాలు జరుగుతున్నాయని, వీటిని కొన్నవారు తర్వాత ఇబ్బందులు పడుతున్నారని, ఫామ్ ప్లాట్ల రిజిస్టేష్రన్పై నిషేధం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని తమకు ఫిర్యాదులు అందినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019, తెలంగాణ పంచాయత్రాజ్ చట్టం 2018లో పొందుపరిచిన విధంగా ఎక్కడా ఫామ్ ప్లాట్లు అమ్మడానికి వీలు లేదని, ఫామ్ల్యాండ్ అంటే 2వేల చదరపు మీటర్లు లేదా ఇరవై గుంటల స్థలం ఉండాలని ప్రభుత్వం నిర్దేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు ఫామ్ప్లాట్లు రిజిస్టేష్రన్లు చేయరాదని, 2020 జీవో నెంబర్ 131 ప్రకారం అనధికార లేఅవుట్ల ప్లాట్లలో నిర్మించడానికి ఎలాంటి అనుమతులు ఇచ్చేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసిందని రంగనాథ్ తెలిపారు.
అందుకే ఫామ్ల్యాండ్స్ విషయంలో ప్రజలు హైడ్రా సూచనలు పాటించాలని రంగనాథ్ అన్నారు. కాగా సోమవారం బుద్దభవన్లోని హైడ్రా ప్రజావాణికి వివిధ సమస్యలపై 64 ఫిర్యాదులు వచ్చాయి. తమ కాలనీలకు వెళ్లేందుకు వీలు లేకుండా కొంత మంది కాలనీ వాసులు చుట్టూ ప్రహారీలు నిర్మించుకుంటున్నారంటూ పలువురు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రంగనాథ్ రహదారులకు అడ్డంగా నిర్మాణాలు, ప్రహారీలు నిర్మించి ప్రజలను ఇబ్బంది పెడుతున్న వాటిని ప్రాధాన్యాంశాలుగా పరిగణించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన రంగనాథ్ ఆన్లైన్లో గూగుల్ మ్యాప్స్ ద్వారా ఆక్రమణలపై ఫిర్యాదు దారులతో చర్చించి తగిన చర్యలకు అధికారులను ఆదేశించారు.