మల్కాజిగిరి, జనవరి 24: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేసి మరికొందరి జీవితాల్లో వెలుగు నింపారు. మల్కాజిగిరి వాణీనగర్‌కు చెందిన మనోజ్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. మనోజ్ కుమారుడు వంశీ అమెజాన్ కంపెనీలో పని చేస్తుంటాడు. వంశీ, అతడి స్నేహితుడు గురువారం ఉదయం ద్విచక్రవాహనంపై కొమరవెళ్లికి వెళ్లారు.
దేవుడి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఐనాపూర్‌కు చేరుకోగానే వీరి బైక్‌ను వెనుక నుంచి వచ్చిన డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వంశీ, అతడి స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సిద్దిపేట వైద్యశాలకు తరలించగా.. వంశీ స్నేహితుడు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. వంశీని మాత్రం మెరుగైన వైద్య సేవల కోసం గాంధీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న వంశీ కూడా బ్రెయిన్ డెడ్‌కు లోనయ్యాడు. ఈ నేపథ్యంలో తండ్రి మనోజ్ కుమారుడి రెండు కండ్లు, కిడ్నీలను జీవన్‌దాన్ సంస్థకు దానం చేశారు.