జవహర్నగర్, ఆగస్టు 16: జవహర్నగర్ కార్పొరేషన్, బాలాజీనగర్లో దారుణం చోటుచేసుకున్నది. తీవ్ర రక్తస్రావం అవుతుందని ఓ గర్భిణి.. శ్రీ బాలాజీ ప్రైవేట్ హాస్పిటల్ కు రాగా..అక్కడ సరైన వైద్యం అందక మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే యువతి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఎస్హెచ్వో సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం… కార్ఖానకు చెందిన శ్యామలపల్లి నిఖిత(22) గర్భం దాల్చడంతో తీవ్ర రక్తస్రావం చోటుచేసుకున్నది. నిఖిత ఈ నెల 15న శ్రీబాలాజీ హాస్పిటల్కు రాగా వైద్యులు రక్తం ఎక్కించి ఇంటికి పంపించారు. ఆరోగ్యం క్షీణించి తీవ్ర రక్తస్రావం కావడంతో శనివారం ఉదయం హాస్పిటల్కు వచ్చారు. పరీక్షించిన వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తుండగా అపస్మారకస్థితిలోకి వెళ్ళింది.
వెంటనే సీపీఆర్ చేసినా నిఖితలో ఏమాత్రం చలనం కనిపించలేదని, చనిపోయిందని మధ్యాహ్నం వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు పోలీసులు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. ఈ మేరకు నిఖిత కుటుంబసభ్యులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని జవహర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.