Bank of India | సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): బ్యాంకులో పనిచేసే అఫ్రైజర్ ఇద్దరు ఉద్యోగులతో కలిసి నకిలీగోల్డ్కు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి బ్యాంక్ ఆఫ్ ఇండియానే మోసం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. అంబర్‌పేట గోల్నాకకు చెందిన భానుచందర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఖైరతాబాద్ శాఖకు అఫ్రైజర్‌గా పనిచేస్తున్నాడు. బ్యాంకులో కుదవపెట్టే బంగారం నాణ్యతను పరిశీలించి పత్రాలు ఇస్తే.. దానిని బట్టి బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. ఇతడితో బ్యాంకులో రుణాలు మంజూరు చేసే తార్నాకకు చెందిన మహ్మద్ కలీం బేగ్, అలీజాపూర్కు చెందిన ఆరీఫ్ అహ్మద్ సయీద్ చేతులు కలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య 27 మందికి రూ. 4.51 కోట్ల రుణాలు మంజూరు చేశారు. ఈ ఏడాది జూలైలో కలీంబేగ్ ఖైరతాబాద్ బ్రాంచ్‌లోని క్రెడిట్ డిపార్టుమెంట్ నుంచి సిద్దిపేట బ్రాంచ్‌కు మేనేజర్‌గా వెళ్లాడు. అక్కడ ఆగస్టు నెలలో వహీదాబాను, హమీద సయీద్, సయ్యద్ ఖాదర్, షేక్ రేష్మ పేర్లతో ఐదు గోల్డ్ లోన్లు మంజూరు చేశారు. ఈ గోల్డ్‌లోన్ ఖాతాలపై ఉన్నతాధికారులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. ఈ రుణాలకు హైదరాబాద్‌లోని భానుచందర్ అనే అఫ్రైజర్ నుంచి తెచ్చిన ధ్రువీకరణ పత్రం ఉంది. ఈ బంగారాన్ని మరో అఫ్రైజర్తో పరీక్షించడంతో అదంతా నకిలీ బంగారమనే విషయం తేలింది.
దీంతో ఆయా ఖాతాలకు సంబంధించిన రుణాలకు కలీంబేగ్ను అధికారులు బాధ్యుడిని చేయడంతో ఆయన ఆ రుణాలను తిరిగి చెల్లించాడు. దీంతో గతంలో కలీంబేగ్ పనిచేసిన ఖైరతాబాద్‌లోని బ్రాంచ్‌లో గోల్డ్ రుణాలపై దృష్టి పెట్టారు. కలీంబేగ్ ఇచ్చిన 44 లోన్లలో కుదవపెట్టిన బంగారాన్ని ఇతర అఫ్రైజర్లతో తనిఖీలు చేయించగా.. అంతా నకిలీవని తేలింది. పక్కా ప్లాన్‌తో బ్యాంకును మోసం చేసేందుకు బ్యాంకులో పనిచేసే కలీంబేగ్, ఆరీఫ్ అహ్మద్, అఫ్రైజర్ భానుచందర్ స్కెచ్ వేసి దానిని అమలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఖైరతాబాద్ బ్రాంచ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బాలగోపాలన్ సీసీఎస్‌లో ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.