Fake Certificates | శంషాబాద్ రూరల్, జూన్ 3 : లక్షలు తీసుకుని నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఫేక్ సర్టిఫికెట్తో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ వ్యక్తి.. దొరికిపోయి ఇండియాకు తిరిగి రావడంతో ఈ ముఠా పట్టుబడింది. హైదరాబాద్‌లో దొరికిన ముఠాకు సంబంధించిన వివరాలను శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్ మీడియాకు వివరించారు.
నల్గొండ జిల్లాకు చెందిన గోపాల్ రెడ్డి డిగ్రీ సర్టిఫికెట్ కావాలని 2021 ఆగస్టులో హస్తినాపురానికి చెందిన అశోక్ అనే వ్యక్తిని ఆశ్రయించారు. అశోక్ రూ.80 వేలు తీసుకుని తమిళనాడులోని మధురై కామరాజ యూనివర్సిటీలో 2015-18 మధ్యలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసినట్లు నకిలీ సర్టిఫికెట్ అందించాడు. ఇందుకోసం కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి సహకారంతో అశోక్ ఈ సర్టిఫికెట్ తీసుకొచ్చాడు. కాగా, నకిలీ సర్టిఫికెట్తో అమెరికాలోని వెబ్‌స్టార్ యూనివర్సిటీలో గోపాల్ రెడ్డి అడ్మిషన్ తీసుకున్నాడు. ఈ క్రమంలో 2023 సెప్టెంబర్‌లో గోపాల్‌రెడ్డి అమెరికా వెళ్లాడు. 15 నెలల విద్యాభ్యాసం తర్వాత గోపాల్ రెడ్డి సెలవులపై ఇండియాకు వచ్చాడు. కొద్దిరోజుల తర్వాత తిరిగి అమెరికాకు వెళ్లగా.. అక్కడ ఎయిర్‌పోర్టు నుంచే అధికారులు తిరిగి పంపించేశారు. దీంతో శంషాబాద్ విమానశ్రయానికి చేరుకున్న గోపాల్‌రెడ్డిపై అనుమానం వచ్చిన ఆర్జీఐఏ ఇమ్మిగ్రేషన్ అధికారులు అతని సర్టిఫికెట్లు పరిశీలించగా నకిలీవని తేలింది. దీంతో గోపాల్ రెడ్డిని శంషాబాద్ ఆర్జీఐఏ అవుట్‌పోస్టు పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Fake
హస్తినాపురానికి చెందిన అశోక్ శ్రీధనలక్ష్మీ ఓవర్సీస్ ప్రైవేటు లిమిటెడ్ (స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్సీ) పేరుతో లక్షలు తీసుకుని నకిలీ సర్టిఫికెట్లను అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రూ.10 లక్షల నగదుతో పాటు సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, నకిలీ స్టాంప్‌లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మధురై యూనివర్సిటీకి చెందిన 13, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన నాలుగు ఫేక్ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు.