Hyderabad | వెంగళరావునగర్, మార్చి 6: ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తిని ఓ మహిళను నిలువునా మోసం చేశాడు. బంగారం మెరుగులు దిద్దుతానని నమ్మించి ఆమె పుస్తెలతాడుతో ఉడాయించాడు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని సదరు వివాహితపై బెదిరింపులకు కూడా దిగాడు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్న వర్రె దయామణి (37) ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగిని. ఆమెకు ఫేస్బుక్లో మహేశ్ నారాయణ దాస్ అనే పేరుతో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను నగల వ్యాపారిని అని నమ్మించాడు. ఫిబ్రవరి 10వ తేదీన దయామణి ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నాడు. అనంతరం ఆమెను హనుమాన్ జువెల్లరీ అనే వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. మహేశ్‌ను పూర్తిగా నమ్మిన దయామణి.. తన పుస్తెల తాడుకు మెరుగులు దిద్దాల్సి ఉందని చెప్పి.. ఇంటికి రమ్మని పిలిచింది. అప్పుడు దయామణి ఇంటికొచ్చి 40 గ్రామలు బంగారు పుస్తెల తాడును చూసి.. పనిముట్లు తెచ్చుకోలేదని.. దుకాణానికి వెళ్లి మెరుగుపెట్టి తీసుకొస్తానని చెప్పారు.
పుస్తెలతాడు ఇవ్వడానికి మొదట్లో దయామణి నిరాకరించింది. దీంతో ఆధార్ కార్డు జిరాక్స్, జువెల్లరీ షాపు ఫొటోలతో పాటు తన తండ్రి ఫోన్ నెంబర్ అంటూ ఇచ్చాడు. మహేశ్ మాయమాటలు నమ్మిన దయామణి.. తాళిబొట్టును అతనికిచ్చింది. పొద్దున తీసుకెళ్లిన మహేశ్.. సాయంత్రమైనా తిరిగి పుస్తెల తాడు తీసుకురాకపోవడంతో దయామణి అనుమానంతో సోదరుడికి తెలిపింది. బంగారు పుస్తెల తాడు గురించి ఫోన్లో ఆరాతీయగా, దురుసుగా మాట్లాడి ఆ మోసగాడు ఫోన్ కట్ చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించాడు. తాను మోసపోయానని గ్రహించిన దయామణి మధురా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
cheater w