సిటీబ్యూరో, మార్చి 5(నమస్తే తెలంగాణ ) : ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లపై జీహెచ్ఎంసీ ఫుడ్‌సేఫ్టీ ఉక్కుపాదం మోపుతున్నది. ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లతో పాటు సూపర్ మార్కెట్లు, ఐస్‌క్రీం పార్లర్లు ఇతర వాటిపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నది. ఇందులో భాగంగానే ఎఫ్బీ ఫుడ్స్, అంబర్‌పేట మాక్సం బేకరీ, జై మాత, గో ప్రెష్, వావ్ చిన్న, కేఎఫ్‌సీ, మలక్‌పేట స్వాగత్ బార్, స్నేహ చికెన్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ క్రిస్టల్ బార్, చిక్కడపల్లి మోర్ రిటేల్, జీడిమెట్ల వెంకటేశ్వర ఫోర్జెన్ ఫుడ్స్, మియాపూర్ ఫ్యూర్ ఓ నేచురల్‌లో తనిఖీలు నిర్వహించారు. ఇసామియా బజార్లో వెంకటేశ్వర మెడికల్ స్పోర్ట్స్, సుజాత డైరీఫాం, కోఠి గోకుల్ ఛాట్ బండార్, ఎంజె మార్కెట్లో కరాచీ బేకరీ, సంతోష్ దాబా, మదీన గూడలో మధురం టిఫిన్స్, మియాపూర్ సాయిఫుడ్స్, జవహర్‌నగర్ ఆహబ్ ఎంటర్ ప్రైజెస్, బోలక్పూర్ 4 ఎం రెస్టారెంట్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. వంట గదులు అపరిశుభ్రంగా ఉన్నాయని, పారిశుధ్యం నిర్వహణ బాగలేదని అధికారులు గుర్తించారు. ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘించిన ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు నోటీసులు జారీ చేశామని, ల్యాబ్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.