సిటీబ్యూరో, జూన్ 23(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో అధ్వాన్నంగా మారుతున్న శాంతి భద్రతలను చక్కబెట్టేందుకు అర్ధరాత్రి నగర పోలీస్ బాస్‌తో పాటు సిబ్బంది రోడ్లపైకి వస్తున్నారు. భయం నీడలోకి వెళ్తున్న నగర ప్రజలకు భరోసా కల్పించేందుకు సీపీ చర్యలు చేపట్టి తనిఖీలు ముమ్మరం చేశారు. అయితే పెరుగుతున్న నేరాలు.. ప్రస్తుతం చేపట్టిన తనిఖీలతో సెల్‌ఫోన్ స్నాచింగ్‌లు, హత్యలు, దొంగతనాలు, దోపిడీలు ఆగుతాయా..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీంతో విజిబుల్ పోలీస్తో నేరాలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. శుక్ర, శనివారాలలో రాత్రి వేళల్లో పోలీసు సిబ్బంది, అధికారులు విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహించారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉండగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సాఫీగా శాంతి భద్రతలున్నాయి. నిరంతరం పెట్రోలింగ్ వాహనాలు రోడ్లపై తిరిగాయి. డయల్ 100కు ఫోన్ చేస్తే 5 నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. టెక్నాలజీని ఉపయోగించి నేరాలను పూర్తిస్థాయిలో కట్టడి చేస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసింగ్ నిర్వహించారు. కాని, గత డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ శాంతి భద్రతల విషయంపై అంతగా దృష్టి పెట్టకపోవడంతో పరిస్థితులు చేయి దాటి పోతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించి.. వెంటనే చర్యలకు ఉపక్రమించాల్సిన పోలీసు యంత్రాంగం నిద్రావస్తకు చేరుకోవడంతో నేరాలు పెరిగాయి. అర్ధరాత్రి రోడ్లపై ఒంటరిగా నడవలేని దుస్థితికి చేరుకుంది.
రెండు నెలల కిందటే సెల్‌ఫోన్ స్నాచింగ్ ముఠాలు హైదరాబాద్‌లో తిరుగుతున్నాయని, దోచుకున్న సెల్ఫోన్లను విదేశాలకు తరలించి విక్రయిస్తున్నారనే విషయాన్ని గుర్తించి.. ఆయా ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలోనే.. అర్ధరాత్రి ఒంటరిగా వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు కూడా చేశారు. అప్పుడే పోలీస్ యంత్రాంగాన్ని నిద్రావస్తలో నుంచి మేల్కొలిపి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రజలంటున్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు బిజీగా ఉన్నారనే కారణం చూపుతూ భద్రత విషయాన్ని పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. కిందిస్థాయిలో అధికారులు పని చేయడం లేదంటూ ఎన్నో ఘటనలు ఎత్తిచూపిస్తున్నా.. ఉన్నతాధికారుల్లో చలనం లేకుండా పోయింది. నగరంలో అర్ధరాత్రి రౌడీషీటర్ల గొడవలు, వరుస హత్యలు, మొబైల్ స్నాచింగ్ ముఠాలు, గ్యాంగ్ వార్లు జరుగుతుండటంతో నగరం ఉలిక్కిపడింది.
శాంతి భద్రతలను చక్కబెట్టి, నిద్రావస్తలో ఉన్న సిబ్బందిని మేల్కొలిపేందుకు స్వయంగా నగర పోలీస్ కమిషనర్ రంగంలోకి దిగారు. సెల్‌ఫోన్ స్నాచర్ల కోసం యాంటీ డెకాయి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి రౌడీషీటర్ల కౌన్సెలింగ్, రోడ్లపై ఉండే పోకిరీల ఆటపట్టించే కార్యక్రమాలు నిర్వహించి నేరస్తుల్లో భయాన్ని పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చర్యలతో నేర ముఠాలు హైదరాబాద్ నుంచి పారిపోతాయా..! స్నాచింగ్‌లు, దొంగతనాలు, దోపిడీలు తగ్గుతాయా..! వేచి చూడాలని ప్రజలంటున్నారు.