మేడ్చల్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇండ్ల క్రమబద్ధీకరణకు సంబంధించి జీవో 58, 59 దరఖాస్తులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ జీవో కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలన పూర్తయినా క్రమబద్ధీకరణ విషయం పై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించకపోవడంతో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో జీవో 58 కింద 26,092 దరఖాస్తులు రాగా, జీవో 59కింద 15,200 కలిపి మొత్తం 41,292 దరఖాస్తులు వచ్చాయి. అయితే అప్పట్లో ఐదు నియోజకవర్గాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దరఖాస్తుల ఆధారంగా నేరుగా ఇంటి అడ్రస్ ఆధారంగా వెళ్లి పరిశీలన చేశారు. పరిశీలన జరిపి ఇంటి ఫొటోతో పాటు ఆధారాలను అప్లోడ్ చేశారు.
పరిశీలన పూర్తికావడంతో దరఖాస్తుదారులు తమ ఇంటికి సంబంధించి క్రమబద్ధీకరణ అవుతాయని ఆశగా ఎదురు చూశారు. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దరఖాస్తుదారులు నిరుత్సాహనికి గురవుతున్నారు.
జీవో 58,59 పై ప్రభుత్వ ఆదేశాల కోసం రెవెన్యూ అధికారులు వేచి చూస్తున్నారు. కాగా త్వరలోనే అక్రమ లే అవుట్ల నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు త్వరలో దరఖాస్తులను స్వీకరించనున్నారు. దీంతో పాటు జీవో 58, 59 దరఖాస్తులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.