BRS | సిటీబ్యూరో, డిసెంబర్ 24 ( నమస్తే తెలంగాణ) ; హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకునేలా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో బలమైన పునాదులు పడ్డాయి. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న పాలనాపరమైన సంస్కరణలు, అభివృద్ధి విధానాలు నగర రూపురేఖలనే మార్చేశాయి. చిత్తశుద్ధి, దూరదృష్టి, అన్నింటికంటే మించి స్థిరమైన ప్రభుత్వం, బలమైన నాయకత్వంలో మహానగరంలో చెక్కు చెదరని ఆస్తులను సృష్టించారు. అదే సమయంలో సంపదను పెంచి అంతర్జాతీయంగా పెట్టుబడులకు స్వర్గధామంగా నిలిపారు. ఇది మన నగరం అనే అంకితభావంతో పనిచేసిన కేసీఆర్ నాయకత్వాన్నే గ్రేటర్ ఓటర్లు కోరుకుంటూ తన తీర్పును ప్రకటించారు. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సమర్పించిన శ్వేతపత్రానికి బదులుగా హైదరాబాద్ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని తెలంగాణ భవన్ వేదికగా ఆదివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘స్వేదపత్రం’ విడుదల చేశారు. సమగ్ర అంకెలతో వివరించిన కేటీఆర్ మాటలను గ్రేటర్ వాసులు టీవీలు, సెల్ఫోన్లకు అతుక్కుపోయి వీక్షించారు. స్వేదపత్రంను అభినందిస్తూ పలువురు సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌కు 63 టీఎంసీల భరోసా
దేశంలో ఏ మెట్రో నగరానికి కూడా లేనంత తాగునీటి కేటాయింపులు కేవలం ఒకే ఒక్క హైదరాబాద్‌కే ఉండటం విశేషం. గతంలో హైదరాబాద్‌కు 30 టీఎంసీల గోదావరి జలాల కేటాయింపు ఉన్నాయి. వాటిని సులువుగా తరలించుకునేందుకు ఎల్లంపల్లి, నగరానికి సమీంపంలోనే కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ వంటి భారీ రిజర్వాయర్లు ఉన్నాయి. ఇటు కృష్ణా జలాల్లోనూ 33 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. ప్రస్తుతానికి సరఫరా సామర్థ్యం 16.5 టీఎంసీలకు ఉంది. భవిష్యత్తులో మరో 17.5 టీఎంసీలు.. అంటే ఇప్పుడు ఉన్నదానికంటే రెట్టింపు సరఫరా వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకున్నా నీటి వనరుకు డోకా లేదు. నాగార్జునసాగర్ డెడ్‌స్టోరేజీ స్థాయి నుంచి సుంకిశాల పథకం ద్వారా తరలింపునకు అవకాశం ఉన్నందునా.. కరువు కాలంలోనూ సాగర్‌లో కనీసంగా 132 టీఎంసీల నిల్వ ఉంటుందంటే హైదరాబాద్‌కు ఎంత భరోసా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పేదలకు ఉచితంగా రూ.920కోట్ల విలువైన జలాలు
జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు వరం లాంటి ఉచితంగా 20 వేల లీటర్ల మంచినీటి పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం 2020 డిసెంబర్లో ప్రకటించి 2021 జనవరి 12వ తేదీన అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బోరబండలోని ఎస్పీఆర్ హిల్స్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. గృహ కనెక్షన్లు కలిగిన వినియోగదారులకు నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని అందించడం ఈ పథకం ఉద్దేశం. ఈ పథకం 50 లక్షల మంది వరకు 20కేఎల్ ఉచిత తాగునీటి పథకానికి దరఖాస్తు చేసుకోగా, ప్రస్తుతం 11.10 లక్షల మంది కుటుంబాలకు లబ్ధి జరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.920కోట్ల విలువ గల నీటిని కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందించింది.
ఎస్ఆర్డీపీతో సాఫీగా ప్రయాణం
హైదరాబాద్ అంటే ట్రాఫిక్ పద్మవ్యూహం. ఇది ఒకప్పటి మాట. కేసీఆర్ ప్రభుత్వంలో ఎస్ఆర్డీపీ పథకంతో ఈ ట్రాఫిక్ సుడిగుండాలను ఒక్కొక్కటిగా ఫ్లై ఓవర్ల రూపంలో ఛేదిస్తోంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా 36 ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు లేదా నిర్మాణం ప్రారంభిస్తే ఆది పూర్తవ్వడానికి ఒకప్పుడు ఏండ్లకు ఏండ్లు పట్టేది. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటువంటి అలసత్వానికి స్వస్తి పలుకుతూ.. ఎదురయ్యే అన్ని ఇబ్బందులను సమర్థవంతంగా అదిగమిస్తూ మౌలిక సదుపాయాల ప్రణాళికలను త్వరితగతిన పూర్తి చేస్తున్నది. ఇందుకు నగరంలో చేపట్టిన ఎస్ఆర్డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం) నిర్మాణాలు. నాలుగు ఫ్లై ఓవర్లు కట్టి నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టామని డబ్బాలు కొట్టుకున్న సమైక్య పాలకులకు భిన్నంగా మౌలిక వసతుల కల్పనలో మొక్కవోని దీక్షతో పరుగులు పెట్టించి పాలనలో తనదైన ముద్ర వేసుకున్నది.
ఇందులో భాగంగానే సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా ప్రభుత్వం రూ.5112.36కోట్ల అంచనా వ్యయంతో 47 ప్రాజెక్టులు చేపట్టగా.. ఇప్పటి వరకు 36 ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో 20 ఫ్లై ఓవర్లు, ఐదు అండర్‌పాస్‌లు, ఏడు ఆర్వోబీ/ఆర్‌యూబీలు, కేబుల్ బ్రిడ్జి, మరో మూడు ఇతర పనులను పూర్తి చేశారు. ఇక మిగిలిన 11 ప్రాజెక్టుల్లో ఇతర శాఖలకు సంబంధించి మూడు పనులు మినహా, జీహెచ్ఎంసీ సంబంధించి 8 ప్రాజెక్టులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. పురోగతిలో ఉన్న 8 ప్రాజెక్టుల్లో ఒకటి మినహా వచ్చే నెలలో మిగిలిన ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా అందుబాటులోకి వచ్చిన చోట ట్రాఫిక్ సమస్య పూర్తిగా తొలగిపోయింది. ప్రయాణం సాఫీగా జరగడంతో వాహనదారులకు సమయం, ఇంధనం ఆదా అవుతుంది. అత్యధికంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ, కూకట్పల్లి, బాచుపల్లి, పటాన్చెరువు, అబిడ్స్, చార్మినార్, ఎల్బీనగర్ , బాలానగర్, చాంద్రాయణగుట్ట, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఉప్పల్, సికింద్రాబాద్, ఈసీఐఎల్, అల్వాల్, కొంపల్లి , జీడిమెట్ల కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీ లేకుండా పరిష్కారం లభించింది.
‘ప్రభుత్వమంటే ఇలా ఉండాలి.. పాలన అంటే ఇలా సాగాలని ప్రతి వ్యక్తి కోరుకున్న విధంగానే తొమ్మిదిన్నరేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గ్రేటర్లో అభివృద్ధి, సంక్షేమం నిర్విఘ్నంగా సాగింది. హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకునేలా అన్ని రంగాల్లో బలమైన పునాదులు పడ్డాయి. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న పాలనాపరమైన సంస్కరణలు, అభివృద్ధి విధానాలు నగర రూపురేఖలనేమార్చేశాయి. చిత్తశుద్ధి, దూరదృష్టి, అన్నింటికంటే మించి స్థిరమైన ప్రభుత్వం, బలమైన నాయకత్వమైన కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్‌లో చెక్కు చెదరని
అభివృద్ధితో సంపదను సృష్టించింది. అంతర్జాతీయంగా పెట్టుబడులకు స్వర్గదామంగా నిలిచింది. ఐటీ, లైఫ్ సైన్సెస్లోనే కాదు మౌలిక సదుపాయాల కల్పనతో దూసుకుపోయింది. ఇది మన నగరం అనే అంకితభావంతోనే పనిచేసిన కేసీఆర్ ప్రభుత్వానికే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు పని చేసిన వారిని వెన్నుతట్టేలా తన తీర్పును ప్రకటించారు. హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం రూపంలో అబద్ధాలు పలికి ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేసింది. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రం పూర్తి డొల్ల అని, తప్పుల తడక-అబద్ధాల పుట్ట అని పేర్కొంటూ హైదరాబాద్ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేసిందో తెలంగాణ భవన్ వేదికగా ఆదివారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘స్వేదపత్రం’విడుదల ద్వారా సమగ్రంగా అంకెలతో సహా వివరించారు.
అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఐటీ రంగం ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందింది. అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్య స్థానంగా మారింది. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలైన అమెజాన్, గూగుల్, మైక్రోసాప్ట్, ఆపిల్, పేస్బుక్, వంటి కంపెనీలు తమ రెండో అతి పెద్ద కార్యాలయాలను అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశాయి. ఐటీ ఎగుమతులు 2014లో రూ.57వేల కోట్లు ఉంటే, 2023 నాటికి రూ.2.41 లక్షల కోట్లకు పెరిగాయి. అదేవిధంగా ఐటీ ఉద్యోగాలు 2014 నాటికి 3,23,396 ఉంటే, 2023 నాటికి 10 లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. ఐటీ రంగం కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్స్ నిర్మాణం చేపట్టాం. వీటితో పాటు ఎమర్జింగ్ టెక్నాలజీలైన ఏఐ, రోబోటిక్స్, డ్రోన్స్ వంటి వాటికి ప్రత్యేకంగా ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ శాఖల్లో వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలను అందించాం.
100 శాతం మురుగునీటి శుద్ధి
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్‌ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా రూ.3866.41 కోట్ల వ్యయంతో 31ఎస్టీపీల పనులకు కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూడు ప్యాకేజీల వారీగా పనులు చేపట్టి పూర్తయిన చోట ఒక్కొక్కటిగా అందుబాటులోకి తెచ్చారు. కోకాపేట, దుర్గం చెరువు వద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాలు వినియోగంలోకి రాగా.. ప్రారంభానికి 10 ఎస్టీపీలు సిద్ధంంగా ఉన్నాయి.
టీవీలకు అతుక్కుపోయిన జనం, సోషల్ మీడియాలో చక్కర్లు
తొమ్మిదిన్నరేండ్లలో సాధించిన ప్రగతి, సృష్టించిన ఆస్తుల వివరాలతో స్వేద పత్రం ద్వారా తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు వివరించడంతో గ్రేటర్ వాసులు టీవీలతోపాటు సెల్ఫోన్లకు అతుక్కుపోయారు. లైవ్ వస్తున్నంత సేపు షాపులు, హోటళ్లు ఇలా ఎక్కడికక్కడ వీక్షించారు. ప్రముఖులు సైతం కేటీఆర్ పవర్ ప్రజెంటేషన్‌ను ఆసక్తిగా వీక్షించారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి ఏమిటి? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ఏమిటి? వంటి ఎన్నో అంశాలను కేటీఆర్ ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా వివరించడం అందరినీ ఆకర్షించింది. కేటీఆర్ చెప్పిన ప్రతి మాటనూ స్వాగతించడంతోపాటు మహానగరాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని బాటలు వేసిందని అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా స్వేదపత్రం పవర్‌పాయింట్ ప్రదర్శన వివరాలను పలువురు సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ఆకట్టుకున్నారు.
వరద ముంపునకు శాశ్వత పరిష్కారం
గ్రేటర్లో సాధారణం కంటే ఏకంగా 65శాతం అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఒక వంతైతే.. రెండు నెలల వర్షపాతం కేవలం నాలుగైదు రోజుల్లోనే కుమ్మరించడం.. అందులోనూ రెండు సెంటీ మీటర్లకే అతలాకుతలమయ్యే నగరంలో గంటల వ్యవధిలోనే 28 సెంటీమీటర్ల అత్యధిక వర్షం కురిస్తే ఆ వర్షం బీభత్సం ఊహించలేం. సరిగ్గా 2020 అక్టోబర్ మాసంలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. దీంతో నగరవాసుల జీవనం చిన్నాభిన్నమైంది. రోజుల తరబడి నీళ్లలోనే నగర వాసులు జీవనం గడిపారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం వరద ముంపునకు సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భవిష్యత్‌లో వరద ముంపు బెడద లేకుండా ఉండేందుకుగానూ ప్రభుత్వం స్ట్రాటజిక్ నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పనులకు శ్రీకారం చుట్టింది. తొలి విడత రూ.985.45కోట్లతో 57 చోట్ల చేపట్టిన పనులు దాదాపుగా 80శాతం మేర పూర్తయ్యాయి. ముఖ్యంగా చార్మినార్, ఎల్బీనగర్, ముషీరాబాద్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ పరిధిలో 100శాతం పనులు పూర్తి చేసుకుని వరద గండం శాశ్వతంగా తొలగిపోయింది. గతంలో చినుకుపడితేనే జలదిగ్బంధంలోకి వెళ్లే అనేక కాలనీలు ఇప్పుడు నిశ్చితంగా ఉన్నాయంటే కేవలం ఎస్ఎన్డీపీ పథకం కింద చేపట్టిన పనుల ఫలితమేనని నగరవాసులు ముక్తకంఠంతో చెబుతున్నారు. త్వరలోనే మరిన్ని ప్రాంతాలలో వరద గండం శాశ్వతంగా తొలగిపోనున్నది. ఇదంతా దూరదృష్టి గల కేసీఆర్ ప్రభుత్వంతోనే సాధ్యమని నగరవాసులు అభిప్రాయపడ్డారు.
147 శాతం పెరిగిన అటవీ విస్తీర్ణం
హైదరాబాద్ మహానగర నివాసితులకు మెరుగైన చకటి వాతావరణం కల్పించి, జీవన ప్రమాణాలను పెంపొందించింది. ఉష్ణోగ్రతను తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం కోసం వివిధ ప్రాంతాల్లో పారులను అభివృద్ధి చేయడంతో పాటు ఖాళీ స్థలాలలో యాదాద్రి మోడల్ మియవాకి, వర్టికల్, థీమ్ పారులు, మెరిడియన్, అవెన్యూ ప్లాంటేషన్, జంక్షన్ సుందరీకరణ ట్రీ పార్లు లాంటి తదితర రకాల పేర్లతో పచ్చదనం, సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టింది. తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మహా నగర పరిధిలో 147శాతం అటవీ విస్తీర్ణం పెరగడం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో 33.15 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం కాగా తెలంగాణకు హరిత హారం కార్యక్రమం చేపట్టిన తర్వాత అటవీ విస్తీర్ణం 81.81 స్వేర్ కిలో మీటర్లకు పెరిగినట్లు ఎఫ్ఎస్ఐ (ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా) ప్రకటించింది. ఎఫ్‌ఎస్‌ఐతో పాటు అర్బోర్ డే ఫౌండేషన్ సంస్థ, ఎఫ్ఏఓ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యూఎన్) సంస్థలు 2020 సంవత్సరానికి గాను హైదరాబాద్ నగరాన్ని ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్‌గా గుర్తింపు పొందింది. 63 దేశాలకు చెందిన 119 పట్టణాలు, నగరాలు ఈ పోటీలో పాల్గొనగా, హైదరాబాద్ నగరానికి ట్రీ సిటీ ఆఫ్ వరల్డ్ ఘనత సాధించింది.
బహుళ ప్రయోజనాల లింకు రోడ్లు
ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ప్రయాణ దూరం తగ్గించడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా రహదారులను అభివృద్ధి చేసింది. పెరుగుతున్న జనాభా, జన సాంద్రతను దృష్టిలో ఉంచుకొని కొత్త రోడ్ల నిర్మాణం, ఉన్న రోడ్ల పరిరక్షణ, లింకు రోడ్లకు వేర్వేరుగా ప్రణాళికలతో నగరాన్ని సుందరంగా మార్చింది. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి, ప్రయాణ దూరాన్ని, సమయాన్ని ఆదా చేసేందుకు అనువుగా గ్రేటర్‌తో పాటు శివారు మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున లింకు రోడ్లను నిర్మించారు. రూ.2140 కోట్లతో హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్ఆర్డీసీఎల్) లింకు రోడ్లను అభివృద్ధి చేస్తూ ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దారు. తొలి విడతలో 137 మిస్సింగ్ లింకు రోడ్ల అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి విడతలో రూ.275.53 కోట్లు ఖర్చు చేసి 22 చోట్ల కలిపి 24.30 కిలోమీటర్ల మేర లింకు రోడ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ఎక్కువశాతం వెస్ట్‌జోన్‌లోనే ఉండగా.. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం లభించింది. రెండో విడతగా రూ.207.26 కోట్లతో 20.16 కిలోమీటర్ల మేర పనులు చేపట్టగా.. 70 శాతం మేర పనులు పూర్తి చేసి.. ఇక్కడే మూడవ విడతలో 50 రోడ్లను 120.92 కి.మీ మేర నిర్మించేందుకు సుమారు రూ.1500 కోట్లతో పనులు చేపట్టారు. కోర్ సిటీలో ప్రసుత్తం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని, అలాంటి పరిస్థితి శివారు ప్రాంతాల్లో తలెత్తకుండా రోడ్డు మార్గాలను అభివృద్ధి చేసే ప్రణాళికలను బీఆర్ఎస్ ప్రభుత్వం బాటలు వేసింది. వచ్చే 50 ఏళ్ల వరకు ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా సాఫీగా సాగిపోయేలా రోడ్ నెట్ వర్క్‌కు పునాది వేసింది.
కేసీఆర్ పాలన స్వర్ణయుగం
పదేండ్ల కేసీఆర్ పాలన స్వర్ణయుగంగా గడిచింది. వ్యాపారులు, రైతులు , ఉద్యోగులతో పాటు అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. మరోసారి కేసీఆరే పాలన చేస్తే అద్భుతాలు జరిగేవి. ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ హామీలను అమలు చేయకుండా ఆలస్యం చేస్తున్నది. శ్వేతపత్రంలో సరైన వివరాలు ఇవ్వని కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందోనని ప్రజల్లో భయం మెదలైంది. ఇచ్చిన హామీల అములుకోసం కాంగ్రెస్ పాలకులు పనిచేయాలి.
– ఇందిరాగౌడ్, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్
వాస్తవాల దిక్సూచి ‘స్వేదపత్రం’
కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రజలకు స్వేదపత్రాన్ని వివరించడం అద్భుతం. ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను ఎప్పటికీ మరిచిపోరు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషిచేశారు. 24 గంటల విద్యుత్ సరఫరాతో పరిశ్రమల్లో ఉత్పత్తులు పెంచుకోవడంతో సంపాదన కూడా పెరిగింది. ఇతర ప్రాంతాల నుంచి కూలీలు వలసవచ్చి బతుకుతున్న రోజులు ఏర్పడ్డాయి.
– లింగం మనోజ్ ముదిరాజ్, హయత్‌నగర్.