సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : కరెంట్ స్త్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను విద్యుత్ అధికారులు తొలిగించడంపై కేబుల్ ఆపరేటర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా కేబుల్ వైర్లు తొలగింపుతో ఇంటర్నెట్ కనెక్షన్స్ బంద్ కావడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్క్‌ఫ్రం హోం ఉద్యోగులు, టీవీలు, వ్యాపారాలు అన్నీ మూగబోయాయి. మొబైల్ డాటాతో సేవలు ఉపయోగించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో కస్టమర్లు అంతా కేబుల్ ఆపరేటర్స్‌కు ఫిర్యాదులు చేశారు. కేబుల్ ఆపరేటర్లు ప్రభుత్వ విధానాలను ఖండించారు. ఈ మేరకు మంగళవారం టీజీఎస్పీడీసీఎల్ వద్ద ఆందోళన చేశారు. కేబుల్స్‌ను ఉన్నపలంగా తొలిగిస్తే ఎలా అని ప్రశ్నించారు.
కనీసం సమయం ఇవ్వకుండా తొలిగించడాన్ని ఖండించారు. సుమారు 1.20 కోట్ల మంది జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఇంటర్నెట్, టీవీ సర్వీసులు చాలా కీలకమని, అస్తవ్యస్తంగా ఉన్న కేబుల్, ఇంటర్నెట్ కేబుల్స్‌ను ఒకేరోజు తొలగించడం వల్ల లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలంగాణ కేబుల్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ మిగతా అసోసియేషన్ స్పష్టం చేసింది. నగరంలోని రామంతాపూర్, బండ్లగూడ, అంబర్‌పేటల్లో జరిగిన వరుస కరెంటు ప్రమాదాలతో ఏకంగా ఎనిమిది మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం గ్రేటర్ పరిధిలో కరెంటు స్తంభాలకు ఉన్న కేబుల్స్ అన్నింటిని కట్ చేయాలని నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ మంగళవారం సిబ్బందిని రంగంలోకి దింపి కేబుల్స్‌ను కట్ చేయించారు. దీంతో అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున మింట్ కాంపౌండ్‌కు తరలివచ్చి సీఎండీ ముషారఫ్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. తమకు సమయం ఇస్తే కరెంటు స్తంభాలకు ఉన్న కేబుల్స్‌ను తొలగించి… వాటి స్థానంలో ఒకే ఫైబర్ కేబుల్‌ను వేస్తామని కోరారు.
అనంతరం అసోసియేషన్ సభ్యులు పలువురు మాట్లాడుతూ 35 ఏండ్లుగా నగరంలో ఇలా విద్యుత్ స్తంభాలకు కేబుల్స్ ఉన్నాయని, ఆ వ్యవస్థను ఒక్కరోజులో తొలగించడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతారన్నారు. ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ సేవలుగానీ, టీవీ మాద్యమంగానీ ప్రజలకు ఎంతో కీలకమని, ప్రస్తుతం అధికారులు కేబుల్స్ తొలగించడం వల్ల తమకు 3-6 నెలల సమయం ఇస్తే నగరంలోని కేబుల్ వ్యవస్థ తొలగించి.. ఒకే కేబుల్ వేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీర్చిదిద్దుతామని అన్నారు. వరుస సంఘటనలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ జరిగిన సంఘటనలు కేబుల్స్ కారణంగా జరగలేదని తేల్చి చెప్పారు. కేబుల్ వైర్లలో విద్యుత్ ప్రసారం కాదని అన్నారు.