సిటీబ్యూరో: కుప్పకూలిన రియాల్టీతో హెచ్ఎండీఏ ఖజానా ఖాళీ అవుతుంటే.. ప్రభుత్వం నుంచి నిధుల్లేక విలవిల్లాడిపోతున్నది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ సర్కారు చెప్పుకుంటున్నా.. ప్రాజెక్టుల నిర్మాణానికి చిల్లి గవ్వ అదనంగా ఇవ్వడం లేదు. గతంలో హెచ్ఎండీఏకు వచ్చే ఆమ్దానీతో వరల్డ్ క్లాస్ నగరానికి అనువైన ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు, ఇతర విభాగాల పరిధి నిర్మించే ప్రాజెక్టులకు కూడా ఆర్థిక వనరులను హెచ్ఎండీఏ సమకూర్చితే.. ఇప్పుడు సొంత పనులు చేపట్టడానికి అవసరమైన నిధుల కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక బిల్డింగ్ అనుమతులు, ఇతర అనుమతుల ద్వారా నెలవారీగా వచ్చే ఆదాయం సగానికి పడిపోయింది. కనీసం ప్రభుత్వమైన భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తుందని భావిస్తే.. అత్తెసరు నిధుల కేటాయింపులతో చేతులు దులుపుకొంది. ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులు, లింకు రోడ్లు నిర్మాణం, గ్రీన్ ఫీల్డ్ హైవే, కొత్వాల్‌గూడ ఏకో పార్క్‌తో పాటు నగరంలో రెండో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి వంటి ప్రాజెక్టుల కోసం రూ. 5-6వేల కోట్లు వెచ్చిస్తే తప్ప.. పనులు చేపట్టే అవకాశం లేకుండా పోయింది. కానీ ప్రభుత్వం రూ. 500 కోట్లను బడ్జెట్లో కేటాయించి చేతులు దులుపుకొంది. ఇక 7200 చదరపు కిలోమీటర్లు ఉన్న హెచ్ఎండీఏ పరిధిని మరో నాలుగు జిల్లాల్లోని 3వేల కిలోమీటర్లకు విస్తరించినా ఆ స్థాయి నిధులివ్వలేదు. కనీసం పెరిగిన పరిధికి అనుగుణంగా నిర్వహణ ఖర్చులకు అయ్యే రూ. 30 కోట్లు కూడా బడ్జెట్లో చూపలేదు.
హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడంలో హెచ్ఎండీఏ కీలక పాత్రను పోషిస్తోంది. కొత్తగా పెరిగిన విస్తీర్ణానికి అనుగుణంగా 10 వేల చదరపు కిలోమీటర్లకు విస్తరించిందనే గొప్పలు చెప్పుకోవడమే తప్ప.. విస్తరణకు అనుగుణంగా హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక వసతులకు అవసరమైన నిధులు లేకపోవడంతో.. అభివృద్ధి కుంటు పడే అవకాశమే కనిపిస్తోంది. కనీసం సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టులన్నీ శంకుస్థాపన చేసిన 18 కిలోమీటర్ల రెండు ఎలివేటెడ్ మార్గాలు, 7 కి.మీల మీరాలం కేబుల్ బ్రిడ్జి వంటి ప్రాజెక్టులకైనా ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు.
రెండు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ఏడాది పూర్తయినా.. ఇప్పటికీ భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయలేకపోయారు. ఇలా చేతి నిండా ప్రాజెక్టులు ఉన్నా.. ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహకాలు లేకపోవడంతో, ఏటా ఓఆర్ఆర్ ప్రాజెక్టు కోసం బ్యాంకులకు ఇచ్చే యాన్యుటీ చెల్లింపులకే ప్రభుత్వం ఇచ్చే రూ. 500 కోట్లు సరిపోయే పరిస్థితి నెలకొని ఉంది. పరిధి పెంచి ఉత్సాహం నింపిన హెచ్ఎండీఏకు.. ప్రభుత్వం నిధులు కేటాయించకుండా నిర్జీవంలా మార్చుతుందనే విమర్శలు వస్తున్నాయి. గతేడాది కూడా రూ.500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా అదనంగా విడుదల చేయలేదు.
ఇప్పటికే హెచ్ఎండీఏ పరిధిలో చేపట్టనున్న ప్రాజెక్టుల అంచనా వ్యయం దాదాపు రూ. 23వేల కోట్లు అవుతుందనే అంచనాలు ఉన్నాయి. తాజా బడ్జెట్‌పై గంపెడాశలతో ఉన్న అధికారులకు ప్రభుత్వం రిక్తహస్తమే చూపి, అప్పుల కోసం హెచ్ఎండీఏను ప్రేరేపితం చేసింది. ఇప్పటికే నిధులను సమకూర్చుకునే క్రమంలో హెచ్ఎండీఏ ఆస్తులను తనాఖా పెట్టేందుకు సిద్ధంగా ఇందుకోసం ఏజెన్సీలను కూడా నియమించుకుంది. దీంతో బడ్జెట్ ఆశలు నీరుగారిపోవడంతో ఆస్తుల ద్వారా నిధులను సమకూరితే తప్ప.. హెచ్ఎండీఏ పరిధిలో అభివృద్ధి పనులకు ఆస్కారమే లేకుండా పోయింది.