.సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్‌లో తాగునీటి డిమాండ్‌ను అధిగమించడమే లక్ష్యంగా జలమండలి చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే తాగునీటి కొరత లేకుండా చూడాలనే ఉద్దేశంతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఈ సమీక్షలో పలు అంశాల గురించి చర్చించారు. రానున్న మూడు నెలలకు ట్యాంకర్ మేనేజ్ మెంట్ స్ట్రాటజీపై చర్చించారు. అదనపు ట్యాంకర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికపై దానకిశోర్ మాట్లాడారు. అదనపు వాటర్ ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని జలమండలి ఎండీకి సూచించారు. ప్రస్తుతం ఉన్న ట్యాంకర్ల గురించి ఆరా తీయగా.. ఇప్పటికే 76 కొత్త ట్యాంకర్లు సమకూర్చినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్‌లో ట్యాంకర్ డిమాండ్ తీర్చేందుకు 5వ తేదీ నాటికి మరో 67 ట్యాంకర్లు అదనంగా సమకూర్చునేందుకు సమాయత్తం అవుతున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా వాటర్ ట్యాంకర్ ఆపరేట్లరతోనూ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ మాట్లాడారు. సరఫరా, ఇతర అంశాల్లో సమస్యలేవైనా ఉన్నాయా అని వారిని అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ నుంచి వచ్చిన డ్రైవర్ల సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. వీరి ద్వారా వాణిజ్య వినియోగదారులకు రాత్రి సమయాల్లో ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేయాలన్నారు. శనివారం రాత్రి ఒకరోజే.. 299 ట్యాంకర్ల ద్వారా 880 ట్రిప్పులు సరఫరా చేసినట్లు వెల్లడించారు. జంట జలాశయాల నుంచి తరలించిన నీటిని శుద్ధి చేయడానికి కాండ్యూట్ పరిధిలోని 2 ఎంఎల్డీ, 3 ఎంఎల్డీ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లను పున:ప్రారంభించాలని దానకిశోర్ అధికారులను ఆదేశించారు. వినియోగదారుల నుంచి వచ్చే ట్యాంకర్ బుకింగ్స్, ఫాలో అప్ కోసం ఎంసీసీని పర్యవేక్షించాలన్నారు. వినియోగదారులు తమ ట్యాంకర్ బుకింగ్‌ని ట్రాక్ చేయడానికి ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని ఆదేశించారు. అవసరమైతే మే, జూన్ నెలల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అవసరమైతే మరిన్ని వాటర్ ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు
చేస్తామన్నారు.
ట్యాంకర్ల డిమాండ్ ఎకువగా ఉన్న డివిజన్ 3, 6, 9, 15, 18 లలోవినియోగదారులకు వేగంగా సేవలందించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. డివిజన్ 3కి ఖాదర్ మొహీయుద్దీన్, డివిజన్ 6కి వినోద్, డివిజన్ 9కి సుబ్బారాయుడు, డివిజన్ 15కి తిప్పన్న, డివిజన్ 18 కి సాయిరమణను నియమించారు. ఈ సమీక్షలో ఈడీ డాక్టర్ సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ఆపరేషన్ డైరెక్టర్ – 2 స్వామి, సీజీఎంలు, జీఎంలు తదితరులు పాల్గొన్నారు.