సిటీబ్యూరో, మార్చి 27(నమస్తే తెలంగాణ): డ్రగ్స్, గంజాయి తదితర మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్న ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు తాజాగా నగరంలోని పలుచోట్ల దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఐదుగురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు పరారీలో ఉన్న మరో ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. ఎస్టీఎఫ్ సీఐ భిక్షారెడ్డి కథనం ప్రకారం…నగరానికి చెందిన ఎస్.కె.మహ్మద్ రహీమ్, మహ్మద్ ఫ్రకుద్దీన్లు ఎర్రగడ్డ మెట్రోస్టేషన్ సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తున్నారు.
సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి అరెస్టు చేశారు. 2.78 గ్రాముల ఎండీఎంఎ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ కేసులో సౌదీ అరేబియాకు చెందిన సఫాన్ , బెంగళూరుకు చెందిన డ్రగ్స్ సఫ్లయర్ ఇబ్రహీమ్ జహీర్‌లు ఉన్నట్లు గుర్తించి, వారిపై కూడా కేసు నమోదు నమోదు చేశారు. ప్రస్తుతం వీరిద్దరు పరారీలో ఉన్నారు.
మరో కేసులో..
ధూల్‌పేట ప్రాంతానికి చెందిన కునాల్ సింగ్, వినోద్ సింగ్, హేమబాయ్లు గుట్టుచప్పుడు కాకుండా లోయర్ ధూల్‌పేట్, జుంగూర్ బస్తీలో గంజాయి అమ్మకాలు జరుపుతున్నారు. సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు గురువారం వారి నివాసాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 1.302కిలోల గంజాయితో పాటు నాలుగు సెల్ ఫోన్లు, యాక్టివా హోండా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో అనికేష్ సింగ్, అర్తిబాయ్, సరేన్, గణేశ్సింగ్లపై కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో సీఐ భిక్షారెడ్డితో పాటు ఎస్సైలు బాలరాజు, సంధ్య, కానిస్టేబుళ్లు యాదగిరి, అనీఫ్, నితిన్, మహేశ్వర్, కౌశిక్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.