సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఆబ్కారీ స్టేషన్ల ప్రారంభోత్సవం ప్రశ్నార్థకంగా మారింది. శనివారం జరగాల్సిన స్టేషన్ల ప్రారంభోత్సవం ముచ్చటగా మూడోసారి వాయిదా పడింది. ఈసారి వాయిదాకి ఓ ఎమ్మెల్యే అలకనే కారణమన్నట్లు ్ల సమాచారం. సదరు ప్రజాప్రతినిధిని మంత్రులు, పార్టీ పెద్దలు అర్ధరాత్రి వరకు బుజ్జగించే ప్రయత్నం చేసినా.. అది ఫలించకపోవడంతో స్టేషన్ల ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు ఆబ్కారీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో రోజురోజుకు పెరిగిపోతున్న గంజాయి, డ్రగ్స్ తదితర మాదక ద్రవ్యాల వినియోగం, స్మగ్లింగ్ తదితర నేరాలను అరికట్టేందుకు బీఆఎర్ఎస్ ప్రభుత్వం గతంలో ఆబ్కారీ శాఖను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగానే 2020 ఎక్సైజ్ పోలీసు స్టేషన్ల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ పరిధిలో 12 ఆబ్కారీ స్టేషన్లు, మెదక్, వరంగల్ డివిజన్ పరిధిలో మరో 2 స్టేషన్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ నూతన ఆబ్కారీ స్టేషన్లను ఈ ఏడాది ఏప్రిల్ 1న ప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసిన అధికారులు.. మే 14న ముహూర్తం ఖరారు చేశారు.
నూతన ఆబ్కారీ స్టేషన్లకు జరిగిన నిధుల కేటాయింపులో ఆర్థిక వ్యవహారాలపై ఓ ప్రజాప్రతినిధి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో మే 14న ప్రారంభం కావాల్సిన కార్యక్రమం రెండోసారి వాయిదా పడింది. ఎట్టకేలకు సదరు ప్రజాప్రతినిధిని అన్నివిధాలా సంతృప్తిపరిచిన అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఈనెల 28న మూడోసారి ముహూర్తం ఖరారు చేశారు. కానీ ఈ ముహూర్తం కూడా కలిసిరాలేదు.
తాను అందుబాటులో లేను.. వచ్చిన తర్వాత చూద్దామంటూ తనకు సరైన సమాచారం ఇవ్వకపోవడమే కాకుండా తన ఇలాఖాలో ఏర్పాటు చేస్తున్న స్టేషన్ల ప్రక్రియలో తనకు ప్రాధాన్యత కల్పించకపోవడంపై ఎమ్మెల్యే అలక చెందినట్లు ఆబ్కారీ భవన్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. సదరు ప్రజాప్రతినిధిని బుజ్జగించేందుకు ఆబ్కారీ ఉన్నతాధికారులు, మంత్రులు శుక్రవారం అర్ధరాత్రి వరకు ప్రయత్నించినా అతను ససేమిరా అనడంతో చేసేది లేక మూడోసారి కూడా ఆబ్కారీ స్టేషన్ల ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు సమాచారం.
మూడుసార్లు వాయిదా పడిన ఆబ్కారీ స్టేషన్ల ప్రారంభోత్సవంపై సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటులో కొందరు ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర పనుల్లో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవడం సహజం. కానీ ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభోత్సవాల్లోనూ అడ్డంకులు సృష్టించే ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎలాంటి సేవలు చేస్తారనే విమర్శలు తలెత్తుతున్నాయి.
ఎక్సైజ్ స్టేషన్ల ప్రారంభోత్సవంలోనే ఇన్ని అడ్డంకులు ఎదురవుతుంటే ఇక పాలనాపరంగా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని ప్రజలు వాపోతున్నారు. ఆబ్కారీ శాఖలో నిలిచిపోయిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కూడా ఇదే తరహాలో వీగిపోతున్నదని, దీంతో ఏండ్లుగా సిబ్బంది పదోన్నతులు ,బదిలీలు లేక ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది.