సిటీబ్యూరో, డిసెంబరు 28 (నమస్తే తెలంగాణ): నూతన సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో ఆబ్కారీ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఆదివారం జరిపిన దాడుల్లో వేర్వేరు చోట్ల డ్రగ్స్, గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 5.39గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌తో పాటు 7.303కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే… బెంగళూరు నుంచి నగరానికి డ్రగ్స్ రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు ఎస్టీఎఫ్ పోలీసులు శంషాబాద్ ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టారు. అ క్రమంలో అటుగా వస్తున్న క్యాబ్‌ను ఆపి, తనిఖీ చేయగా క్యాబ్ డ్రైవర్ సాయి చరణ్ వద్ద 5.39 ఎండీఎంఏ డ్రగ్‌తోపాటు 6 నాన్ డ్యూటీ పెయిడ్ లికర్ బాటిల్స్ లభించాయి. దీంతో నిందితుడిని అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి 5.39గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌తో పాటు 6ఎన్డీపీ మద్యం బాటిళ్లు, 3 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.
సరూర్‌నగర్‌లో….
సరూర్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర భవన్ హుడా కాలనీ సమీపంలో ఒరిస్సా నుంచి నగరానికి గంజా యి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 6.300కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సాకు చెందిన బెహన్ దూరే జగన్నాథ్, డాల్ సరోజ్, జలారి అనే ముగ్గురు వ్యక్తులు స్వస్థలం నుంచి నగరానికి గంజాయి సరఫరా చేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు ఆదివారం సరూర్‌నగర్ ప్రాంతంలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 6.300కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును సరూర్‌నగర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. మరో కేసులో మీర్‌పేట ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి నగరానికి అక్రమంగా తరలిస్తున్న 64 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును మీర్‌పేట ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
నానక్‌రామ్‌గూడలో…
నానక్‌రామ్‌గూడలో గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని శంషాబాద్ డీటీఎఫ్ పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 1.3కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అస్సాంకు చెందిన దిలీప్ కోచే స్వస్థలం నుంచి గంజాయిని తీసుకువచ్చి, నగరంలో పరిచయస్తులకు విక్రియిస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న డీటీఎఫ్ పోలీసులు నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 1.3కిలోగల గంజాయి స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ నిమిత్తం కేసును శేరీలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
యూకే నుంచి డ్రగ్స్
వెంగళరావునగర్, డిసెంబర్ 28 :యూకే నుంచి కొరియర్ ద్వారా నగరానికి చేరిన మాదక ద్రవ్యాలను గుట్టు చప్పుడు కాకుండా అవసరమైన వారికి విక్రయిస్తున్న ముగ్గురిని ఎస్ఆర్.నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 95 గ్రాముల చరస్, 1.5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బల్కంపేట శ్మశానవాటిక సమీపంలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు యూంటీ నార్కోటిక్ విభాగం పోలీసులు శనివారం ఆకస్మికంగా దాడి చేశారు. మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన టైల్స్ వ్యాపారి షేక్ సల్మాన్ (25), బాలానగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి కుముద్ కుమార్ శ్రీవాస్తవ(27), మహబూబ్ నగర్ జడ్చర్లకు చెందిన విద్యార్థి కేతావత్ అరవింద్ కుమార్(21)లను అరెస్టు చేశారు. యూకేకు చెందిన శశాంక్ కొరియర్ ద్వారా మాదక ద్రవ్యాలను హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సుజిత్ రావు అనే వ్యక్తికి పంపుతుండేవారు. సుజిత్‌రావు ఈ డ్రగ్స్‌ను షేక్ సల్మాన్‌కు అందజేసేవాడు. షేక్ సల్మాన్ కుముద్ కుమార్ శ్రీవాస్తవ ద్వారా విక్రయిస్తుండేవాడు. ఇదే క్రమంలో డ్రగ్స్‌ను కేతావత్ అరవింద్ కుమార్‌కు విక్రయిస్తుండగా యాంటీ నార్కోటిక్ వింగ్ పోలీసులు పట్టకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను ఎస్ఆర్.నగర్ పోలీసులకు అప్పగించారు. యూకే నుంచి డ్రగ్స్ సరఫరా చేసిన శశాంక్, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన సుజిత్ రావులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.