సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): నగరంలో గంజాయి విక్రయాలు జరుగుతున్న పలు చోట్ల ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 4.291కిలోల గంజాయి , మూడు ద్విచక్రవాహనాలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే…శామీర్‌పేట, అలియాబాద్, లాల్‌బజార్ ప్రాంతాలకు చెందిన సాయితేజ, సుమిత్‌కుమార్, రాహుల్ గంజాయిని రవాణా చేస్తుండగా సమాచారం అందుకున్న ఆబ్కారీ ఎస్టిఎఫ్ పోలీసులు చార్మినార్ వద్ద ముగ్గురు నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.274కిలోల గంజాయి, ద్విచక్రవాహనం, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మరో కేసులో….
ధూల్‌పేట ప్రాంతానికి చెందిన హేమంత్‌సింగ్, గోవింద్‌సింగ్, రమేష్ సింగ్ కలిసి ఆసిఫ్‌నగర్ గాంధీటెక్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్టిఎఫ్ పోలీసులు బుధవారం తనిఖీలు నిర్వహించగా హేమంత్‌సింగ్ వద్ద 2.14కిలోల గంజాయి లభించింది. దీంతో నిందితుడిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న గోవింద్ సింగ్, రమేష్సింగ్లపై కేసులు నమోదు చేశారు.
హఫీజ్‌పేట బస్టాప్‌లో….
పటాన్ అర్భాజ్ అనే వ్యక్తి అఫీజ్‌పేట బస్టాప్ ప్రాంగణలో గంజాయి విక్రయిస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్టిఎఫ్ పోలీసులు నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, అతడి వద్ద నుంచి 1.3కిలోల గంజాయి, ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.