హైదరాబాద్: వీకెండ్ వచ్చిందంటే చాలు.. సర్వీస్ అపార్ట్మెంట్లో మద్యం విందులు, డ్రగ్స్ వినియోగాలు, అమ్మాయిలు.. డాన్సులు.. రేవ్ పార్టీలు. ఇలా ఒకటేమిటి కొండాపూర్ ఏరియాలో జరుగుతున్న చిత్ర విచిత్రాలు ఇవి. వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్ ఎస్వీ నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్లో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కొన్ని ముఠాలు అక్కడివారిని వీకెండ్ సందర్భంగా హైదరాబాద్‌కు తీసుకువచ్చి రేవ్ పార్టీలు (Rave Party) నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం ఎస్ఐ సంధ్య బాలరాజు తన సిబ్బంది కలిసి దాడిచేశారు. రేవ్ పార్టీని భగ్నం చేసి తొమ్మిది మందిని పట్టుకున్నారు.
విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనే కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా మారుపేర్లతో బ్యాంక్ అకౌంట్, మారు ఆధార్ కార్డులతో డబ్బున్న సరాబులను తీసుకువచ్చి రెండు రోజులపాటు ఎంజాయ్ చేయించి తీసుకు వెళ్తుంటారు. ఈ ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరందరినీ శేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సీఐ సంధ్య తెలిపారు. వారి నుంచి 2.080 కేజీల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్, 1.91 గ్రాముల చెరస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నాలుగు కార్లు, 11 సెల్ ఫోన్లు, 9 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో రాహుల్ (డ్రగ్స్ తెప్పించే వ్యక్తి), ఉన్నతి ఇమ్యాన్యుయెల్ అలియాస్ ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్నే (ఆర్గనైజర్), అప్పికోట్ల అశోక్ కుమార్ (ఆర్గనైజర్), సమ్మెల సాయి కృష్ణ, నాగెళ్ల లీలా మణికంఠ, హిల్టన్ జోసఫ్, తోట కుమారస్వామి, అడపా యశ్వంత్ శ్రీదత్, నంద సుమంత్ తేజ ఉన్నారు. వీరితోపాటు మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు.