సిటీబ్యూరో: ఫామ్‌హౌస్‌లే లక్ష్యంగా కొందరు ఆబ్కారీ అధికారులు మామూళ్ల కోసం వేటాడుతున్నారు. ప్రభుత్వ ఖజానా నింపడంలో కీలక పాత్ర పోషించే ఆబ్కారీ అధికారులు జేబులు నింపుకోవడంలో కూడా తమ మార్క్‌ను ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలను బూచీగా చూపిస్తూ అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా శంషాబాద్, చేవెళ్ల, శామీర్‌పేట, మేడ్చల్, హయత్‌నగర్ ప్రాంతాల్లో ఉన్న ఫామ్‌హౌస్‌లను లక్ష్యంగా చేసుకొని కొందరు ఎక్సైజ్ పోలీసులు మామూళ్ల కోసం వేధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫామ్‌హౌస్‌లలో ఒక్క మద్యం బాటిల్‌ను వినియోగించినా.. ఆబ్కారీ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలనే నిబంధన కొందరు అధికారులు, సిబ్బందికి కాసుల వర్షం కురిపిస్తున్నది. అయితే చారాణ కోడికి బారాణ మసాల అన్నట్లు నలుగురైదుగురు కలిసి రూ.2వేల విలువ చేసే ఒక మద్యం బాటిల్‌తో ఫామ్‌హౌస్‌లో చిన్నపాటి పార్టీ చేసుకుంటే దానికి రూ.9వేలు పెట్టి లైసెన్స్ తీసుకోవడం ఏమిటని అటు వినియోగదారులు, ఇటు ఫామ్‌హౌస్ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ఈ నిబంధనను ఆసరాగా చేసుకుని కొందరు ఆబ్కారీ అధికారులు మామూళ్లు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకపోతే కేసులు నమోదు చేస్తున్నట్లు ఫామ్‌హౌస్‌ల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.
రెండు మూడు నెలల కిందట వరకు ఫామ్‌హౌస్‌లపై దాడులతో హడావిడి చేసిన కొందరు ఆబ్కారీ అధికారులు మొత్తానికి నిర్వాహకులను దారిలోకి తెచ్చుకుని ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలవారీ ఒప్పందాలు కుదరడంతోనే సదరు అధికారులు ఇప్పుడు ఫామ్‌హౌస్‌ల జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వారాంతంలో ఫామ్‌హౌస్‌లలో ఎక్కువగా 5 నుంచి 10మంది సభ్యులతో కూడిన పార్టీలు జరుగుతాయని, అందులో రెండు నుంచి మూడు వరకు మద్యం బాటిళ్లు మాత్రమే వినియోగిస్తారని నిర్వాహకులు చెబుతున్నారు.
అయితే చిన్న చిన్న పార్టీలు చేసుకునే వినియోగదారులు ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి తీసుకునేందుకు నిరాకరిస్తున్నారని, ఎందుకంటే వారు వినియోగించే రెండు మూడు వేల మద్యం కోసం రూ.9వేలు వెచ్చించి అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నిస్తున్నారని నిర్వాహకులు వాపోతున్నారు. అడపాదడపా జరిగే పెద్ద పార్టీలతో గిట్టుబాటు లేక చిన్న పార్టీలకు అవకాశం కల్పించక తప్పడం లేదని ఫామ్‌హౌస్‌ల నిర్వాహకులు వాపోతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని సంబంధిత అధికారులు మామూళ్ల కోసం వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులకు, ఇటు సంబంధిత ఎక్సైజ్ స్టేషన్ అధికారులకు, మరో వైపు ఎస్వోటీ పోలీసులు, ఎస్టీఎఫ్, డీటీఎఫ్ తదితర టీమ్‌లకు చెందిన పలువురు పోలీసు అధికారులకు మామూళ్లు ఇచ్చుకోలేని నిర్వాహకులు శివారు ప్రాంతాల్లో ఉన్న తమ ఫామ్‌హౌస్‌లను మూసివేస్తున్నారు.