జవహర్‌నగర్, మార్చి 14 : కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై అసెంబ్లీలో ప్రశ్నిస్తారనే భయంతోనే మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని అమానుషంగా సస్పెండ్ చేయడం దుర్మార్గమని మాజీ మేయర్ మేకల కావ్య విమర్శించారు. అసెంబ్లీలో జగదీశ్‌రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ మేయర్ మేకల కావ్య ఆధ్వర్యంలో జవహర్‌నగర్ కార్పొరేషన్ ప్రధాన చౌరస్తాలో శుక్రవారం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా మేకల కావ్య మాట్లాడుతూ.. తెలంగాణలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, పంటలు ఎండుతున్నాయని, రైతుబంధు లేదని, రుణమాఫీ పూర్తిస్థాయిలో కాలేదని, భూగర్భ జలాలు ఎండిపోయి గ్రామాల్లో నీటి ఎద్దడి ఘోరంగా ఉందని, ఆరు గ్యారంటీలు అడ్డగోలు హామీలుగానే మిగిలాయని దుయ్యబట్టారు. జగదీశ్‌రెడ్డి అసెంబ్లీలో అన్‌పార్లమెంటరీ పదాలు మాట్లాడలేదని, కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేసిందని, బీఆర్ఎస్ గొంతు నొక్కాలని చూస్తున్న కాంగ్రెస్‌పై ప్రజలు తిరగబడుతున్నారని అన్నారు. అనంతరం జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని ప్రధాన చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మేక లలితాయాదవ్, జిట్టా శ్రీవాణిశ్రీనివాస్రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు భార్గవ్‌రామ్, నాయకులు సుధాకర్‌చారి, బండకింది ప్రసాద్‌గౌడ్, అహ్మద్‌పాషా, కృష్ణయాదవ్, సాధిక్, బాలస్వామి, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.