రాష్ట్రంలో రైతు ప్రభుత్వం ఉందని మరోసారి నిరూపితమైంది. సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ ప్రకటించడంతో గ్రేటర్‌వ్యాప్తంగా సంబురాలు జరిగాయి. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు, రైతులు గురువారం క్షీరాభిషేకం చేశారు. అన్నదాతలకు అండగా ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటామని రైతులు ముక్తకంఠంతో తెలిపారు.
మేడ్చల్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సును కోరుకుంటూ రైతు శ్రేయో రాజ్యం దిశగా అడుగులు వేస్తున్నది. ఒక రైతు బంధు, బీమా, ఉచిత విద్యుత్తు, ఇంకా రుణాల మాఫీ లాంటివి రైతుల శ్రేయస్సును కాంక్షిస్తూ అమలులో ఉన్నవే కావడం గమనార్హం. ఇది రైతు ప్రభుత్వం అనడానికి రుణమాఫీలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. రైతుల ఆర్థికాభివృద్ధికి వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. రైతులకు రైతుబంధు పథకం, 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్, రైతుబీమా పథకం ప్రవేశపెట్టి విజయవంతంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పలు పథకాలను అమలు చేస్తున్నది.
రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆరే తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండాలని రైతులు కోరుకుంటున్నారు. రుణమాఫీపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 7,383 మంది రైతులు లబ్ధి పొందనుండగా రూ. 36.48 కోట్లు రుణమాఫీ కానున్నాయి. గురువారం నుంచే రుణమాఫీ పక్రియను ప్రారంభించి నెలన్నరలో పూర్తి చేయనున్నారు. రైతులకు రుణమాఫీ చేసినందున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతుల తరపున రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం కేసీఆర్ దయవల్లే.. వ్యవసాయం పండుగ
వ్యవసాయాన్ని పండుగలా చేస్తున్నామంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దయ వల్లే. రుణమాఫీ చేసి మరోమారు రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరూపించుకున్నారు. వ్యవసాయం చేయాలంటే భయపడాల్సిన పరిస్థితులు పోయాయి. వ్యవసాయం అంటే ఇష్టపడి చేస్తున్న రోజులు వచ్చాయి. రైతులంతా బీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటారు. వ్యవసాయ సాగు విస్తీర్ణన్ని పెంచుకుంటూ పోతున్నాం.
– కండ్లకోయ దాస్, గౌడవెల్లి
కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం
రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం. కేసీఆర్ సారు అందిస్తున్న రైతుబంధు పథకంతో వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా ఉన్నాం. 24 గంటల ఉచిత కరెంట్‌తో సాగు చేసుకుంటూ పంటలు పండించుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం. వ్యవసాయానికి డిమాండ్ వచ్చే విధంగా కృషి చేసిన కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం.
– వెంకటేశ్ యాదవ్, గౌడవెల్లి
రైతులంతా సంతోషంగా ఉన్నారు
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రైతులంతా సంతోషంగా ఉన్నారు. ఇప్పటికే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందేలా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు, రైతు బీమా పథకం ప్రవేశపెట్టి రైతులందరికీ భరోసాగా నిలుస్తున్నారు. జిల్లాలో 7,383 మంది రైతులకు లబ్ధి జరిగింది. రైతుల పక్షాన మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం సారుకు కృతజ్ఙతలు.
– మధుకర్‌రెడ్డి, డీసీఎంఎస్ వైస్ ఛైర్మన్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా