Electricity | సిటీబ్యూరో, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యంత కీలకమైన ప్రాంతాల్లో అమీర్‌పేట్ ఎల్లారెడ్డిగూడ ఒకటి. అలాంటి ప్రాంతంలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. దీనిపై ఓ విద్యుత్ వినియోగదారుడు ఏడీఈకి ఫోన్‌చేసి ప్రతి రోజూ మా దగ్గర కరెంటు పోతున్నదని చెబితే.. ఇన్వర్టర్ పెట్టుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఇదే విషయమై అమీర్‌పేట సెక్షన్ పరిధిలో ఆపరేటర్‌కు ఫోన్ చేస్తే.. విద్యుత్ లైన్ పనులను కాంట్రాక్టర్ సరిగా చేయకపోవడం వల్లే తరచూ సరఫరాకు అంతరాయం కలుగుతోందని చెప్పారు.
కేవలం విద్యుత్ నెట్వర్క్ నిర్వహణ లోపం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతుందని తెలిసినా ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అమీర్‌పేట, ఎల్లారెడ్డిగూడ కాకుండా.. గ్రేటర్ పరిధిలోని 10 సర్కిళ్ల పరిధిలో ఇలాంటి అంతరాయాలు విద్యుత్ వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. విద్యుత్ సంస్థ తరపున నిర్వహణ, మరమ్మతుల పనులు చేసే కాంట్రాక్టర్లతో ఏఈ, ఏడీఈ, డీఈ స్థాయి అధికారులు కుమ్మక్కై పర్యవేక్షణ చేయడం లేదనే ఆరోపణలున్నాయి. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లు తీసుకొని విద్యుత్ నెట్వర్క్ పనులను సరిగా పర్యవేక్షించకపోవడం వల్లే ఈ సమస్య పునరావృతమవుతూనే ఉంది.
డిమాండ్‌కు సరిపడా విద్యుత్..
రాష్ట్రంలో విద్యుత్‌కు లోటు లేదు. ఎంత డిమాండ్ ఉన్నా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు నెట్వర్క్ సైతం అందుబాటులో ఉంది. అయినా తరచూ విద్యుత్ అంతరాయం జరుగుతూనే ఉన్నది. ఒక వైపు ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా సరఫరా చేస్తున్నామని చెబుతుంటే, వినియోగదారులు మాత్రం మా ప్రాంతంలో విద్యుత్ అంతరాయాలు ఉన్నాయని ఫిర్యాదు చేస్తున్నారు.
తరచూ తలెత్తుతున్న విద్యుత్ అంతరాయాలకు మరమ్మతుల్లో నాణ్యతా లోపమే ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. విద్యుత్ సంస్థ తరపున క్షేత్ర స్థాయిలో విద్యుత్ నెట్‌వర్క్‌లో ఉండే 11 కేవీ ఫీడర్ లైన్స్, ఎల్టీ లైన్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఏబీ స్విచ్‌లు, కండక్టర్ కేబుల్స్ ఏర్పాటు వంటి పనులను కాంట్రాక్టర్లు చేస్తున్నారు. కాంట్రాక్టర్లు చేసే పనులు నాసికరంగా ఉండటం వల్లే తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోందని ఆపరేషన్స్ విభాగంలో పనిచేసే ఫ్యూజ్ ఆఫ్ కాల్ (ఎఫ్ఓసీ) సిబ్బంది పేర్కొంటున్నారు.
వారి మాట వినే కాంట్రాక్టర్లకే..
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) పరిధిలో విద్యుత్ నెట్వర్క్ పనులు చేసేందుకు సంస్థలో నమోదైన ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లనే ఎంపిక చేసి పనులు అప్పగించాలి. కానీ, ఇక్కడే ఉన్నతాధికారులైన ఎస్ఈ, డీఈలు, ఏడీఈలు తమకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లను ఎంపిక చేసి పనులు అప్పగిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ కీలకం కావడంతో వారు చెప్పినట్లు వినే కాంట్రాక్టర్లకే పనులు అప్పగిస్తూ అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల నగర శివారులోని కీసర డివిజన్ పరిధిలో రూ.15 లక్షలతో చేపట్టే పనులకు 28 శాతం తక్కువ మొత్తంతోనే టెండర్ వేసిన ఎల్-1 కాంట్రాక్టర్‌కు పనులను అప్పగించకుండా, 20 రోజుల పాటు పెండింగ్‌లో పెట్టి టెండర్ రద్దు చేశారు. తాము అనుకున్న కాంట్రాక్టరుకు టెండర్ రాకపోవడంతో డీఈ స్థాయి అధికారులు ఆ కాంట్రాక్టునే రద్దు చేసిన ఘటనలు ఉన్నాయి. ఇలా క్షేత్ర స్థాయిలో విద్యుత్ కాంట్రాక్టర్లు చేయాల్సిన పనులు నాసిరకంగా ఉండటం వల్లే తరచూ విద్యుత్ అంతరాయాలకు దారి తీస్తున్నాయని ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా నిరంతరం సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ యంత్రాంగం నెట్వర్క్ పనులను సమర్థవంతంగా చేసేలా చూడాల్సిన బాధ్యత ఆపరేషన్స్ విభాగం ఉన్నతాధికారులపై ఉంది.