హయత్ నగర్, జూలై 12: విశ్వనగరం అంటే హైటెక్ సిటీ కాదు.. శివారు ప్రాంతాల కాలనీల్లో కూడా మౌలిక వసతులు కల్పించడమే అభివృద్ధి సాధించడమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) స్పష్టంచేశారు. శనివారం హయత్ నగర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ విశ్వనగరమని హైటెక్ సిటీని చూపుతూ అభివృద్ధి సాధించామని గొప్పలు చెబుతుందే తప్ప నగర శివారు ప్రాంతాల కాలనీల్లో కూడా మౌలిక వససతులైన రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. హైదరాబాద్ శివారులో కొత్తగా విస్తరించిన కాలనీల్లో గానీ, బస్తీల్లో గానీ సమస్యలు చూస్తే గుండె తరుక్కుపోతుందన్నారు.
రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థ లేకపోవడంతో కాలనీల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వర్షాకాలంలో వరదలకు ఇండ్లు మునిగిపోతున్నాయి తప్ప వరదలను తరలించేందుకు సరైన స్ట్రామ్ వాటర్ డ్రైన్లు ఏర్పాటు చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో హయత్ నగర్, మన్సూరాబాద్, నాగోల్ డివిజన్లల్లో సరైన డ్రైనేజీ, రోడ్లు, స్ట్రామ్ వాటర్ డ్రైన్ లేకపోవడంతో సమస్యలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. నగర శివారు కాలనీలు, బస్తీల్లో కూడా మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు.
లక్షలాది మంది నివాసముంటున్న దాదాపు 30 కాలనీల ప్రజలు రాకపోకలు సాగిస్తున్న ప్రధాన మార్గంలో కూడా కనీసం రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయలేదన్నారు. నాగార్జునసాగర్ రోడ్డు నుంచి హయత్‌నగర్‌కు కుమ్మరికుంట, హయత్ నగర్ చెరువు మధ్య ఉన్న 80 నుంచి 100 ఫీట్ల రోడ్డును పునరుద్ధరించేందుకు దాదాపు రూ.6 కోట్లతో త్వరలోనే నిర్మాణ పనులు చేయిస్తానని హామీనిచ్చారు. హయత్ నగర్ డివిజన్లో ప్రధానమైన డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆయా కాలనీవాసులు పాల్గొన్నారు.