పీర్జాదిగూడ, ఏప్రిల్2: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో సకల సౌకర్యాలతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్( ఇంటిగ్రేటెడ్ మార్కెట్)ను త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి నిర్మాణ పనులు శరవేంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల మార్కెట్లు ఒకే చోట లభించేలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కార్పొరేషన్ పరిధి మేడిపల్లిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను రూ. 7కోట్ల 50 లక్షలతో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో క్రయవిక్రయాలు జరిగేలా రూపుదిద్దుకుంటుంది. నగర ప్రజలకు పరిశుభ్రమైన కూరగాయలు, మాంసం, పండ్లు, అందించాలనే ఉద్దేశంతో సమీకృత మార్కెట్ నిర్మిస్తున్నారు. ఇందులో మొత్తం 88 స్టాల్స్ కాగా విజ్టేబుల్ 28, నాన్‌వెజ్ 30, ఫ్రూట్స్, పూలకు 30 స్టాల్స్ నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కూరగాయలు ఇతర వ్యాపారాలు రోడ్లపై అమ్మకాలు సాగిస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు కార్పొరేషన్లో ఇంటింగ్రేటెడ్ మార్కెట్‌ను నిర్మిస్తున్నారు. సకల సౌకర్యాలతో ఒకే ప్రాంతంలో అన్నిరకాల మార్కెట్లను అందుబాటులోకి తీసుకు వచ్చేలా ఈ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో వెజ్, నాన్‌వెజ్‌లతో పాటు పండ్లు, పూలు, నిత్యావసర సరుకులు లభించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మార్కెట్లో వ్యాపారులకు, వినియోగదారులకు పార్కింగ్ సౌకర్యాలతో పాటు, మూత్రశా లలు, ఇతర వసతులు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, అధికారులతో ఎప్పటికప్పుడు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.
పట్టణ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఒకే ప్రాంతంలో సమీకృత మార్కెట్ నిర్మాణ చేపట్టడం వల్ల అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. సకల హంగులతో హంగులతో మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– జక్క వెంకట్‌రెడ్డి, పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్