సుల్తాన్ బజార్, జూలై 11: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సాధారణ బదిలీల ప్రక్రియలో వైద్య ఆరోగ్య శాఖలో ఓ విధానం లేకుండా తప్పుల తడకగా నిర్వహిస్తున్నారని, అన్ని క్యాడర్ల ఉద్యోగులు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయం ముందు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు గురువారం నర్సింగ్ ఆఫీసర్స్, ఎంపీహెచ్ఎస్, సీహెచ్‌వో, మేల్, ఫిమేల్ ఎంపీహెచ్‌వోలతో ఇతర క్యాడర్ల ఉద్యోగులు పెద్ద ఎత్తున కోఠిలోని డీహెచ్ కార్యాలయానికి చేరుకొని తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగుల వద్దకే వచ్చిన డీహెచ్ డాక్టర్ రవీంద్ర నాయక్ ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు తెలిపిన వాటిని క్షుణ్ణంగా విన్న డీహెచ్ ఉద్యోగులు ఎవరికి అన్యాయం జరుగదని, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా పలు క్యాడర్ల అసోసియేషన్ ప్రతినిధులు కర్నాటి సాయిరెడ్డి, భరత్, సత్యనారాయణ, మరియమ్మ, భూపాల్, రాజశేఖర్, హరి శంకర్, భరత్ మాట్లాడుతూ ఏఎన్ఎం నుంచి మెడికల్ ఆఫీసర్ల వరకు సాధారణ బదిలీలలో అవకతవకలు పాల్ప డుతున్న అధికారులను తక్షణమే భర్తరఫ్ చేయాలన్నారు. రాత్రి 11 గంటల సమయంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విడుదల చేసిన సీనియర్ లిస్టు పూర్తిగా తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. నాలుగేండ్ల సీనియారిటీ ఉన్న వారికి 14 ఏళ్ళు ఉన్నట్లుగా, 12 ఏళ్ళు ఉన్న వారికి 10 ఏళ్ళు ఉన్నట్లుగా, అంతే కాకుండా చనిపోయిన వారు, రిటైర్డ్ అయిన వారి పేర్ల లిస్టులో ఉండటమేమిటని వారు ప్రశ్నించారు.
సాధారణ బదిలీలను జూలై 3 నుంచి 20వ తేదీలోపే ఇంత త్వరగా ప్రభుత్వం ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో ఉద్యోగులకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాధినేతలపై ఉందని అన్నారు. బదిలీల విషయంలో ఉద్యోగులకు స్పష్టత లేదన్నారు. జీవో నం.80 ప్రకారం, వైద్య ఆరోగ్య శాఖలో ప్రభుత్వం బదిలీలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న తరుణంలో ఉద్యోగులకు సరైన గైడ్‌లైన్స్, స్పష్టమైన విధానాలను ఉద్యోగులకు తెలపకపోవడంతో వారు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని అన్నారు. అన్ని క్యాడర్లలో సీనియారిటి ఫైనల్ లిస్ట్‌ను పెట్టకుండా ఆ లిస్టును ఉద్యోగులకు చూపకుండా, 317 జీవోతో పాటు ఉద్యోగులకు ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ఎలా బదిలీలు చేస్తారని? వారు ప్రశ్నించారు. రాష్ట్ర వాప్తంగా ఉన్న ఉద్యోగుల గ్రీవెన్స్ సర్టిఫికెట్లను కిటికీల ద్వారా తీసుకోవడంతో క్యూలైన్లో ఉద్యోగులను నిలబెట్టి అవమానపరుచడం ఎంత వరకు సమంజసమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీహెచ్ పరిధిలో అవకతవకలకు పాల్పడు తున్న అధికారులను తక్షణమే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సాధారణ బదిలీల సమయాన్ని పొడిగించి బదిలీల ప్రక్రియలో అన్యాయం జరుగకుండా చూడాల్సిన భాధ్యత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా, హెల్త్ సెక్రటరీ క్రిస్టీనా చోంగ్తులు ప్రత్యేక చొరవ తీసుకొని సీనియారిటీ ప్రకారం పారదర్శకంగా బదిలీలను నిర్వహించాలని వారన్నారు.