బంజారాహిల్స్: కేబీఆర్ పార్కు చుట్టూ వందలాది చెట్లను నరికేస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆదివారం ‘సేవ్ కేబీఆర్’ పేరుతో వందలాదిమంది పర్యావరణ ప్రేమికులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ‘కేబీఆర్ పార్కును కాపాడండి.. నగరానికి అక్సిజన్ అందించే చెట్ల ప్రాణాలు తీస్తారా.. చెట్లను నరికి చేసే అభివృద్ధి మాకొద్దు.. కేబీఆర్ చుట్టూ ఎకో సెన్సిటివ్ జోన్‌ను కాపాడండి..’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తూ హెచ్ సిటీ పేరుతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారని పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న చెట్లను నరికివేయడం ద్వారా 2నుంచి 4 సెంటీగ్రేడ్ల ఉష్టోగ్రత పరిసర ప్రాంతాల్లో పెరుగుతుందని, పార్కు చుట్టూ నిర్మించతలపెట్టిన అండర్‌పాస్‌లు, ఫ్లైవోర్ల కోసం వేల మెట్రిక్ టన్నుల కాంక్రీట్‌ను భూమిలోపల వేస్తే భూగర్భజల ప్రవాహాలకు అడ్డంకులు ఏర్పడి కేబీఆర్ పార్కులోని చెరువులు నిండి రోడ్లను ముంచెత్తడం ఖాయమని వారు ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్ సిటీ పేరుతో చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్ బయటపెట్టాలని, చెట్లను నరికివేయకుండా ప్రాజెక్టును చేపట్టాలని, లేకుంటే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. సేవ్ కేబీఆర్ ప్రతినిధులు విజయ్ మల్లంగి, డా.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.