కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న ఏండ్ల నాటి వృక్షజాలాన్ని తొలగించి పర్యావరణానికి తీవ్ర నష్టం కలగజేసే హెచ్సిటీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గేదాకా పోరాటాన్ని కొనసాగిస్తామని సేవ్ కేబీఆర్ ఫోరం ప్రతినిధులు తెలిపారు. చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టు స్టే విధించిన నేపథ్యంలో మంగళవారం వారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చెట్లను నరికేసి పర్యావరణాన్ని విధ్వంసం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి నమూనా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.
సిటీ బ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ) : కేబీఆర్ పార్క్, దాని పరిసరాల్లో 600కు పైగా వృక్ష జాతులు, వందలాదిగా జంతు జాతులు జీవిస్తున్నాయని, ప్రభుత్వం చేపట్టిన హెచ్సిటీ ప్రాజెక్టు వల్ల వాటి మనుగడకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రీయమైన పర్యావరణ అనుమతులు తీసుకోకుండా, ఎలాంటి ప్రజాభిప్రాయం లేకుండా భూసేకరణ చేపట్టారని ఆరోపించారు. పర్యావరణ సున్నిత ప్రాంతంలోనూ చెట్లను కూల్చి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రభుత్వం కేబీఆర్ పార్కును ధ్వంసం చేసి ఏడు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించేందుకు పూనుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫ్లైఓవర్లు, అండర్ పాసులు కట్టడం వల్ల ట్రాఫిక్‌ను ఎలా నియంత్రిస్తారని ప్రశ్నించారు. చెట్ల తొలగింపుతో పాటు పనులు ప్రారంభించడంతో వేడి, విపరీతమైన శబ్దాలు, డ్రిల్లింగ్ వైబ్రేషన్ల వల్ల పార్కులోని సున్నితమైన పర్యావరణ వ్యవస్థ నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు చెట్ల నరికివేతపై స్టే విధిస్తూ పనులను ఆపాలని ఆదేశాలివ్వడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. హెచ్సిటీ పేరిట కేబీఆర్ పార్కు భవితవ్యాన్ని ప్రశ్నార్థకంలో పడేసే ప్రాజెక్టును నిలిపేసేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సేవ్ కేబీఆర్ ఉద్యమ ప్రతినిధులు కాజల్ మహేశ్వరి, మేజర్ సందీప్ ఖురానా, కింగ్షుగ్ నాగ్, డాక్టర్ దొంతి నరసింహారెడ్డి, మాజీ ప్రొఫెసర్ సాగర్ ధారా, లుబ్నా సర్వత్ తదితరులు పాల్గొన్నారు.

తూతూ మంత్రంగా ప్రజాభిప్రాయ సేకరణ
కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించేందుకు ప్రజాభిప్రాయసేకరణ తూతూ మంత్రంగా చేపట్టారని సేవ్ కేబీఆర్ ప్రతినిధులు ఆరోపించారు. జాతీయ పార్కు చుట్టూ చేపట్టే ప్రాజెక్టు విషయంలో కనీసం పర్యావరణ వేత్తలను సంప్రదించకపోవడం తీవ్రంగా కలచివేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టడం చట్టపరంగా నేరంగా పరిగణిస్తారని అన్నారు. కాంట్రాక్టర్లను సంతృప్తి పరిచేందుకు ఏండ్ల నాటి చెట్లను తొలగించి పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు.
దీన్ని ఒకే కాంట్రాక్టర్ ద్వారా అమలు చేసేందుకు వేర్వేరు భాగాలుగా విభజించినట్లు ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. సమగ్ర పర్యావరణ ప్రభావ అంచనా పరిశీలనను తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టును వివిధ భాగాలుగా విభజించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం 2021 నాటి స్టే ఆర్డర్‌ను జీహెచ్ఎంసీ, ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడి చెట్ల నరికివేత, తవ్వకాల పనులు చేపట్టిందని ఆరోపించారు. ఎకో సెన్సిటివ్ జోన్ ప్రక్రియ అసంపూర్తిగా ఉన్నా ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా కోలుకోలేని పర్యావరణ నష్టాన్ని కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
జీవ వైవిధ్యానికి అత్యంత ప్రమాదం..
ప్రభుత్వం చేపట్టిన హెచ్సిటీ ప్రాజెక్టు కార్బన్ ఉద్గారాలను తగ్గించకపోగా వాటిని తీవ్రతరం చేస్తుందని సేవ్ కేబీఆర్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తంచేశారు. వాహనాల రాకపోకలు పెరుగుతుండటం వల్ల ట్రాఫిక్‌తో పాటు ఉష్ణోగ్రత, గాలి నాణ్యతను నియంత్రించే కీలకమైన పట్టణ పచ్చదనం కనుమరుగవుతుందని అన్నారు. కేబీఆర్ పార్క్ కేవలం జీవ వైవిధ్య హాట్‌స్పాట్ మాత్రమే కాదని, పెరుగుతున్న వేడి, కాలుష్యం నుంచి హైదారాబాద్ మహానగరాన్ని కాపాడే కీలకమైన ప్రజా ఉమ్మడి ఆస్తి అన్నారు.
పర్యావరణ పరిరక్షణకు అవసరమైన ప్రాంతాలను కాపాడటం, పర్యావరణ న్యాయ సూత్రాలను నిలబెట్టడం ఎంత అత్యవసరమో సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం స్పష్టం చేస్తున్నదని వెల్లడించారు. ప్రజలకు ఉపయోగపడని ప్రాజెక్టులను కడుతూ జీవైవివ్యాన్ని ప్రమాదంలోకి నెట్టొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహానగరంలో మిగిలి ఉన్న అరకొర పర్యావరణ వారసత్వాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం బలిచేయొద్దని వేడుకున్నారు.