Musi Development | సిటీబ్యూరో, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ): ప్రచార ఆర్భాటం మొదలు పెట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఇప్పడు కొత్త సమస్యలకు తెర లేపుతోంది. మూసీ వెంట ఉన్న నిర్మాణాలను కూల్చి వేసి, జీవనదికి పునర్ వైభవం తీసుకురావడం అనుకున్నంత సులభం కాదని తెలుస్తోంది. మూసీ బఫర్ జోన్‌గా నదికి ఇరువైపులా 50 మీటర్లు ఖరారు చేసే యోచనలో ఉండగా.. ఇదే అన్ని సమస్యలకు ప్రధాన కారణం కానుంది.
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రణాళికలను అమలు చేయాలంటే.. ఈ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలన్నింటిని తొలగించాల్సి వస్తోంది. ఇదే గనుక జరిగితే మూసీ రివర్ ఫ్రంట్ భూసేకరణ పూర్తి చేయడంతోనే ప్రాజెక్టుకు ఏళ్లు పట్టనుంది. లక్షన్నర కోట్లతో ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించి, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులే ఎంఆర్డీసీఎల్కు ఎదురవుతున్నాయి.
56 కిలోమీటర్ల పొడవైన మూసీ నది ప్రక్షాళన కోసం రంగం సిద్ధం చేస్తోంది. దీనికోసం నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నిర్మాణాలు, ప్రాపర్టీలు, ఇతర కట్టడాలను తెలుసుకునేందుకు ఎంఆర్డీసీఎల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో కూడిన బృందం డోర్ టూ డోర్ సర్వే చేసి… ఇప్పటివరకు 13వేలకు పైగా ప్రాపర్టీలను గుర్తించింది. ఇందులో ప్రైవేట్, పట్టా, ప్రభుత్వ భూములతోపాటు, వక్ఫ్, దేవాదాయ భూములు కూడా ఉన్నాయి.
ఇందులో ప్రధానమైన పట్టా, ప్రైవేటు భూముల విషయంలో పునరావాసం, పరిహారం ఇస్తే గానీ భూములను తీసుకునే పరిస్థితి లేదు. ఇక పేదలు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు కూడా పెద్ద మొత్తంలో మూసీ వెంట ఉన్న ప్రభుత్వ భూముల్లో ఏండ్లుగా నివాసం ఉంటుండగా.. ఇప్పుడు వీరిని ఎక్కడికి తరలిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంత నివాసితులు పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధం అవుతుండగా, వీరి ఆస్తులను సేకరించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది.
తాజాగా మూసీ వెంట సర్వే చేయడానికి వచ్చిన అధికారులతో మలక్‌పేట్ సమీపంలో ఉండే నివాసితులు వాగ్వాదానికే దిగారు. తమ భూములు, ఆస్తులను కోల్పోమని, అవసరమైతే కోర్టులను ఆశ్రయించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పరిహారం విషయం పక్కన పెడితే.. నిర్వాసితులుగా మారిపోయే అవకాశం ఉండటంతో మూసీ వెంబడి నివాసితులెవరూ ముందుకు రావడం లేదు. ఇప్పటివరకు పూర్తయిన సర్వేలోనూ నివాసితుల్లో ఎక్కువ మంది పేద, మధ్యతరగతికి చెందినవారే ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం సర్వే కొనసాగుతున్నది. ఈ నెలాఖరులోపు పూర్తి నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు ఎంఆర్డీసీఎల్ అధికారులు వెల్లడించారు.