బంజారాహిల్స్,జూలై 23: తన ఆధీనంలోని స్థలాన్ని క్రమబద్ధీకరించుకున్నానంటూ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్న ఓ వ్యక్తిని షేక్‌పేట రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి తెలిపిన ప్రకారం..జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్ట్ కాలనీలోని ప్లాట్ నం.5 వెనుక భాగంలోని ప్రభుత్వ స్థలంలోని సుమారు 371 గజాల స్థలాన్ని తప్పుడు పత్రాలతో 2008లో జీవో 166 కింద మదన్‌మోహన్‌రెడ్డి క్రమబద్ధీకరించుకున్నాడు.
రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు క్రమబద్ధీకరణను రద్దు చేసి స్థలాన్ని స్వాధీనంలోకి తీసుకున్నారు. దీంతో మదన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. ఏడాది తర్వాత తప్పుడు పత్రాలు సమర్పించి ఈ స్థలంపై ఎల్ఆర్ఎస్ స్కీమ్ పేరుతో ప్రొసీడింగ్స్ తెచ్చుకున్నాడు.
ఈ వ్యవహారంపై రెవెన్యూశాఖ కోర్టును ఆశ్రయించగా.. యథాతదస్థితి కొనసాగించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. వాటిని ధిక్కరించిన మదన్‌మోహన్‌రెడ్డి గత కొన్నిరోజులుగా రేకుల షెడ్లను ఏర్పాటు చేసి లోపల ఇంటిని నిర్మిస్తున్నాడు. సమాచారం అందుకున్న తహసీల్దార్ అనితారెడ్డి ఆదేశాలతో బుధవారం జేసీబీ సాయంతో కూల్చేశారు. ఈ స్థలాన్ని క్రమబద్ధీకరణ చేయలేదని, ఎలాంటి నిర్మాణ అనుమతులు ఇవ్వొద్దని రెవెన్యూ అధికారులు జీహెచ్ఎంసీకి లేఖ రాశారు.