మేడ్చల్, మే 22 (నమస్తే తెలంగాణ) : గ్రామ కంఠం భూముల స్వాహాకు కబ్జాదారులు యత్నిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలంలో గ్రామ కంఠం భూమిని కబ్జా చేసుకునేలా పక్కాగా ప్లాన్ చేసి గ్రామ కంఠం భూమిలో అల్వాల్ జీహెచ్ంసీలో నిర్మాణానికి అనుమతులు పొంది మిగతా గ్రామ కంఠం భూమిని కబ్జా చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై స్థానికుల ఆరోపణల మేరకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. గ్రామ కంఠం భూమిలో అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
అక్రమ నిర్మాణం చేస్తున్న వారికి ఇటీవలే షోకాజ్ నోటీసు ఇచ్చి చేతులు దులుపుకొన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గ్రామ కంఠం భూమిని మరింతగా కబ్జాలు చేసుకునే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అల్వాల్‌లోని గ్రామ కంఠంలో భూమిలో నిర్మాణానికి అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారని స్థానికుల్లో విస్మయం వ్యక్తం అవుతున్నది. తహసీల్దార్ గతంలో గ్రామ కంఠం భూమి అని నిర్ధారించిన నేపథ్యంలో గ్రామ కంఠం భూమిలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు 11 గుంటల భూమిని అధికారులు ఇచ్చారు. గ్రామ కంఠం భూమిలో ఇంటి నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారనేదానిపై విచారణ చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ షోకాజ్ నోటీసులు ఇచ్చి వారం రోజులు పూర్తయైనా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అధికారుల తీరుపై అనుమనాలు వస్తున్నాయి.
అల్వాల్‌లోని 582,583 సర్వేనెంబర్లలు నిషేధిత జాబితాలో ఉన్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఎట్టకేలకు నిలిపివేశారు. ఈ సర్వే నంబర్లు నిషేధిత జాబితాలో ఉన్న రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరుగుతున్న నేపథ్యంలో యూఎల్సీ ప్రభుత్వ భూమిని కాపాడాలనుకున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై ఉన్నతాధికారుల విచారణ జరిపారు. అనంతరం రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్ట్రార్లు సతీశ్, శృతిలపై వేటు వేశారు. దీంతో సుమారు 37 ఎకరాలు ఉన్న యూఎల్సీ భూములను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి రక్షించినట్లయింది.