బంజారాహిల్స్, ఏప్రిల్ 16: జూబ్లీహిల్స్‌లో రూ.30కోట్ల విలువైన ఖరీదైన ప్రభుత్వ స్థలంపై మరోసారి కబ్జాదారులు కన్నేశారు. గతంలో తప్పుడు పత్రాలతో స్థలాన్ని కాజేసేందుకు యత్నిస్తూ జైలుపాలయిన వ్యక్తులు తాజాగా ప్రభుత్వంలోని పెద్దల పేర్లతో మరోసారి తెరపైకి వచ్చి.. సుమారు 1000 గజాల స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. షేక్‌పేట మండలం సర్వేనెంబర్ 403లో టీఎస్ నెంబర్-1, బ్లాక్-హెచ్, వార్డు-9లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం 9లోని సత్వ ఎన్క్లేవ్ సుమారు మూడువేల గజాల స్థలం టీఎస్ఎల్ఆర్ రికార్డుల్లో బంజారాహిల్స్ గుట్టగా నమోదైంది.
ఈ స్థలం డీజేహెచ్ ఫ్లాట్ నెం.101లోని సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్‌గా ప్రభుత్వ స్థలంగా 1976నుంచి ఉంది. సుమారు ఐదేళ్ల కిందట మొవ్వా రవీంద్రనాథ్ అనే వ్యక్తి తన కుటుంబసభ్యుల పేర్లతో బోగస్ పత్రాలు సృష్టించి.. స్థలంలో తిష్టవేయడంతో పాటు జీహెచ్ఎంసీ నుంచి నిర్మాణ అనుమతులు సైతం తీసుకున్నారు. ఈ వ్యవహారంపై అప్పటి తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డికి ఫిర్యాదులు అందడంతో స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఆక్రమణలను తొలగించారు. ఫోర్జరీ పత్రాలతో జీహెచ్ఎంసీ అనుమతులు పొందిన మొవ్వా రవీంద్రనాథ్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసులో రవీంద్రనాథ్‌తో పాటు ఆయన కుమారుడు రాఘవేంద్రనాథ్ అరెస్టయ్యారు.
అప్పటినుంచి ఈ ఖాళీ ప్రభుత్వ స్థలం రెవెన్యూశాఖ ఆధీనంలో ఉంది. కాగా, ఇటీవల మొవ్వా రవీంద్రనాథ్ తరపున అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మనుషులు స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ స్థలాన్ని ఆనుకుని ఉన్న పార్కు స్థలం కబ్జాకాకుండా ఇటీవల జీహెచ్ఎంసీ చేపట్టిన ప్రహరీ నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్నారు. ప్రహరీ నిర్మాణపనులు చేస్తున్న వారిని దబాయిస్తూ పనులు నిలిపివేయాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారు.
ఈ వ్యవహారంపై సత్వా ఎన్క్లేవ్ వాసులు హైడ్రా అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో వారి సిబ్బంది వచ్చి ప్రహరీ నిర్మాణ పనులను చేయిస్తున్నారు. ఇదిలా ఉంటే ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారుల మీద ఒత్తిడి తీసుకువస్తూ సుమారు రూ.30కోట్ల విలువ చేసే 890 గజాల స్థలాన్ని ఆక్రమించేందుకు తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నారని అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
ఈ ప్రయత్నాల్లో భాగంగా గతంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించి అరెస్టయిన మొవ్వా రవీంద్రనాథ్ తరపున హైకోర్టులో పిటిషన్ వేయించారని, తమ ఆధీనంలో ఉన్న స్థలంలోకి వచ్చేందుకు రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ స్థలం కచ్చితంగా ప్రభుత్వ స్థలమేనని, ఎన్నో ఏళ్లుగా తమ ఆధీనంలోనే ఉందని, గతంలో సైతం మొవ్వా రవీంద్రనాథ్ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించాడని షేక్‌పేట మండల తహసీల్దార్ అనితారెడ్డి తెలిపారు. ఈ స్థలంతో పాటు మొత్తం 3వేల గజాల స్థలం ప్రభుత్వానిదేనని, ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేసినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.