దుండిగల్, జూ న్ 11 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. కొందరు కింది స్థాయి రాజకీయ పార్టీల నాయకులు గ్రూపులుగా ఏర్పడి కబ్జాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తుండగా.. రెవెన్యూ అధికారులు తమవంతు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గాజులరామారంలోని సర్వే నంబర్ 13లోని కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని స్వాహా చేయడమే లక్ష్యంగా రాజకీయ పార్టీల నాయకులు కబ్జాదారులను ముందుంచి కూల్చివేతలు జరిపిన చోటే మళ్లీ అక్రమంగా నిర్మాణం చేపడుతున్నట్లు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వే నంబర్ 13లో గతంలో 5.37 ఎకరాలపైగా ప్రభుత్వ భూమి ఉండగా, కబ్జాల బారినపడి చివరకు 3 వేల చదరపు గజాల స్థలం మాత్రమే మిగిలింది. అయితే కొందరు అక్రమార్కులు సదరు 3వేల గజాల భూమిని సైతం వాటాలేసుకొని కబ్జా చేసేందుకు యత్నిస్తుండటం విస్మయపరుస్తోంది. కాని తాము పని చేస్తున్నామని ప్రజల్లో భ్రమలు కల్పించేందుకు అధికారులు అడపాదడపా చర్యలు తీసుకుంటున్నారు. సర్వే నంబర్ 13లో కోట్లు విలువ చేసే 3వేల చదరపు గజాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందని పలు ఫిర్యాదులు అందినా.. రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు నిదర్శనం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ హరితహారం మొక్కలు నాటారు. నేడు ఆ ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంటే ఎవరూ స్పందించే పరిస్థితి లేదు. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన తాసీల్దార్ పట్టించుకోవడం లేదని, రెవెన్యూ అధికారులకు సైతం కబ్జాలో వాటా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ శాఖ అధికారులు స్పందించి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
సెలవులో అధికారులు..
ఈ విషయమై కుత్బుల్లాపూర్ తాసీల్దార్ రెహమాన్, గిర్దావర్ రజనీకాంత్‌లను వివరణ కోరేందుకు యత్నించగా.. తాసీల్దార్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుంది. గిర్దావర్ రజనీకాంత్ మాత్రం తాను సెలవులో ఉన్నానని తెలిపారు. మరో గిర్దావర్ రేణుకను వివరణ కోరగా.. తమకు సిబ్బంది కొరత ఉందని, అక్రమ నిర్మాణాలను తొలగించాలంటే పోలీస్ ప్రొటెక్షన్ అవసరమని పేర్కొన్నారు. తాసీల్దార్ విధుల్లోకి రాగానే చర్యలు చేపడతామని చెప్పారు.
కూల్చివేతకు మహిళల యత్నం
కాగా సర్వేనంబర్ 13లోని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఇంటివద్ద కాపలాగా నిర్మాణదారులు మనుషులను పెట్టారు. వారు పక్కనే ఉన్న ఇందిరమ్మ ఇండ్లకు చెందిన మహిళల పట్ల వెకిలిగా ప్రవర్తిస్తున్నారంటూ.. మంగళవారం పలువురు స్థానిక మహిళలు సదరు నిర్మాణాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న రాళ్లు, ఇటుకలతో గోడలను కూల్చేందుకు ప్రయత్నించగా సాధ్యం కాకపోవడంతో ఇంటిపై వేసిన రేకులను తొలగించారు. అయితే కాపలాకాస్తున్న వారు మద్యం సేవిస్తూ అసభ్యంగా ప్రవరిస్తున్నారని మహిళలు ఆరోపించారు.