రంగారెడ్డి, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమయ్యారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో ఆందోళనలు చేపట్టాలని రంగారెడ్డి జిల్లా జేఏసీ నిర్ణయించింది. పీఆర్సీని వెంటనే అమలు చేయటంతోపాటు కంట్రూబ్యూటరీ పెన్షన్ స్కీం, డీఏ, సీపీఎస్‌లను రద్దుచేసి పాత పెన్షన్ (ఓపీఎస్) విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెన్షనర్ల పెండింగ్ నిధులను వెంటనే చెల్లించాలని, హెల్త్‌కార్డు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని పేర్కొంటున్నారు. అలాగే, ఉద్యోగు ల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని జీవోనంబర్ 25ను సవరించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధ్యాయ దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
సమస్యల పరిష్కారానికి జేఏసీ పలు రకాల ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే ఈ నెల 27న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించాలని, అందులో భాగంగానే రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట కూడా ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 10న పెన్షనర్ల విద్రోహ దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు.
ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా పీఆర్సీ అమలు కాకపోవడం, అలాగే.. ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండటంలో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. సీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్దరణపై ఇచ్చిన హామీ అమలులో తీవ్ర జాప్యం జరుగుతున్నదని., ఉద్యోగుల పెండింగ్ బిల్లులను, ఆరోగ్య పథకం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డీఏలు, పీఆర్సీతోపాటు వివిధ బిల్లులను వెంటనే చెల్లించి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని ఉద్యోగుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే, రోజువారీ ఉద్యోగాలతో సతమతమవుతున్న ఉద్యోగులపై అధికారుల వేధింపులు కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ఉద్యోగుల ఐక్య శక్తిని చాటి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తామన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని పలువురు ఉద్యోగులు బహిరంగంగా వాపోతున్నారు. సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ పునరుద్ధరించి ఉద్యోగులకు అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ అమలులో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదంటూ వాపోతున్నారు. అలాగే, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, సమస్యలను వెంటనే పరిష్కరించి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఉద్యోగాల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీ మూడేళ్లు గడిచినా అమలు చేయడం లేదు. వెంటనే ప్రభుత్వం పీఆర్సీని అమలు చేయాలి. పెండింగ్‌లో ఉన్న డీఏలు సకాలంలో విడుదల చేయకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దుచేసి, ఓపీఎస్ పునరుద్దరణపై ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలి. లేకపోతే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆందోళన చేపడుతాం. ప్రభుత్వం దిగొచ్చే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు.
– జేఏసీ జిల్లా చైర్మన్ యశ్వంత్