మెదక్, మే 12 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉద్దేశ పూర్వకంగా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని, ప్రొటోకాల్ పాటించేలా అధికార యంత్రాంగాన్ని ఆదేశించాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్‌ను ఆమె కలిసి పలు సమస్యలను దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల నర్సాపూర్‌లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి వివేక్ కాంగ్రెస్ పార్టీ సమావేశాల తరహాలో మాట్లాడడం, కాంగ్రెస్ శ్రేణులు అత్యుత్సా హం చేయడంతో తాము కార్యక్రమాన్ని అడ్డుకున్నట్లు తెలిపారు. అభివృద్ధ్ది, సంక్షేమం విషయంలో సహకారం అందిస్తామన్నారు.
ఇటీవల హ త్నూర మండలంలో ఇండ్ల పట్టాలు పంపిణీ ఉందని అధికారులు తెలిపితే తాను వెళ్లానని, తీరా అక్కడికి వెళ్లిన తర్వాత కార్యక్రమం రద్దు చేశామని తెలపడం సరికాదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు ప్రొటోకాల్ పాటించరంటే తాము కార్యక్రమాలకు దూరం గా ఉంటామని కలెక్టర్‌కు తెలిపారు. వడ్లు వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని, లారీలు, హమాలీల సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు. కొనుగోలు కేం ద్రాల్లో తరుగు తీస్తున్నారని, లారీలు అందుబాటులో లేక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిందని కలెక్టర్ దృష్టికి ఎమ్మెల్యే తెచ్చారు. నర్సాపూర్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌కు సునీతాలక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు.