న్యూఢిల్లీ, మే 12: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమని ఐదు రాష్ర్టాల ఎన్నికల ముందు ఊదరగొట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు పూర్తవగానే యూటర్న్ తీసుకుంది. ఎప్పుడెప్పుడు పెంచుదామా అన్నట్టు చమురు కంపెనీలు నష్టాలను ఎదుర్కొంటున్నాయని పదేపదే ప్రస్తావిస్తున్నది. ఈ క్రమంలో దేశంలో చమురు సరఫరాకు ఎలాంటి కొరత లేదని పేర్కొంటూనే, వాటి ధరను పెంచే అవకాశాన్ని కొట్టిపారేయ లేమంటూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మంగళవారం స్పష్టం చేశారు.
ఒక పక్క విదేశీ ప్రయాణాలకు స్వస్తి పలకాలని, ఏడాది పాటు బంగారాన్ని కొనుగోలు చేయవద్దని, పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని, కార్ పూలింగ్ పాటించాలని, మెట్రోలలో ప్రయాణించాలని, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని, ఆన్లైన్లో తరగతులను నిర్వహించాలని ప్రధాని చమురు పొదుపు చర్యల కోసం దేశ పౌరులకు సలహాలు ఇస్తుండగా, మరో వైపు చమురు ధరలు పెరుగుతాయంటూ ఆ శాఖ మంత్రే సూచన ప్రాయంగా తెలియజేశారు.
‘గత నాలుగేండ్లుగా మనం చమురు ధరలను పెంచలేదు. ఎన్నికలై పోయాయి కాబట్టి ఇప్పుడు వాటి ధరలు పెంచుతారంటూ కొందరంటున్నారు. అయితే 2022 తర్వాత మనకు సాధారణ ఎన్నికలతో పాటు పలు ఎన్నికలు దేశంలో వచ్చాయి. ధరలు పెరగవని చెప్పడం నా వాదన కాదు. అయితే ఆ రెండింటికీ సంబంధం లేదన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయదలచుకున్నా’ అని ఆయన చెప్పుకొచ్చారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల ఇంధన పొదుపు చర్యల గురించి ప్రధాని కోరుతున్నారని తెలిపారు.