రంగారెడ్డి, మే 30 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక తీవ్ర వివాదానికి దారి తీస్తున్నది. ఇందిరమ్మ ఇండ్లు పూర్తిగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకే ఇస్తున్నారని అన్ని గ్రామా ల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు వేసిన కమిటీలు కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికే సపోర్టు చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఎక్కడైనా అధికారులు అర్హులను ఎంపిక చేస్తే ఆ పేర్లను తొలగించి తాము సూచించిన వారి పేర్లను చేర్చాలని ఆఫీసర్లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తుండడంతో.. అధికారులకు ఇందిరమ్మ కమిటీ సభ్యులకు మధ్య పలు చోట్ల వాగ్వాదం చోటు చేసుకుంటున్నది. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు సర్వే ఆధారంగా అర్హు ల జాబితాలను గ్రామాల్లో ప్రకటించారు.
అయితే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు సూచించిన వారికే మొదటి విడతలో ఇండ్లు దక్కడంతో కొన్నేండ్లుగా సొంతింటి కోసం ఎదురు చూ స్తున్న అర్హులైన నిరుపేదలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు ప్రొసీడింగ్లు పంపిణీ చేసే సమయంలో అర్హులకు ఇండ్లు రాకుండా.. అనర్హులకు వచ్చాయని పలువురు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్నగర్, చేవెళ్ల వంటి నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా ఏకపక్షంగా జరిగిందన్న ఆరోపణలున్నాయి.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో యాచారం మండలంలోని చింతపట్ల గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు ముందు తన పేరు ఉందని.. తర్వాత కాంగ్రెస్ నాయకులు తన పేరు లేకుండా చేశారని తీవ్ర మనస్తాపం చెంది శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని తన చేతిపై సూసైడ్ నోట్ రాసి మరీ ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడడంతో.. ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది. ఇటీవల తలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లోనూ లబ్ధిదారుల ఎంపిక జాబితాలను ఇచ్చేందుకు గ్రామాలకు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. జిల్లాలో ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
లబ్ధిదారుల ఎంపికలో అధికారులు అర్హులను ఎంపిక చేస్తుంటే.. ఆయా గ్రామాల్లోని కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి.. తాము సూచించిన పేర్లను చేర్పిస్తున్నారు. ఇటీవల యాచారం మండలంలో పలు గ్రామాల్లో ఇప్పటికే ఇండ్లు ఉన్నా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇండ్లు మంజూరు చేయించారని పలువురు పేర్కొంటున్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో పలువురు నాయకు లు నిబంధనల విరుద్ధంగా ఇండ్లను తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి.
ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు కాకుండా అనర్హులకే దక్కుతున్నాయని.. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకే ఇస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. శుక్రవారం రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా.. ఆ ఇండ్లు అర్హులకు దక్కడం లేదని.. ఇప్పటికే ఇండ్లు ఉన్నా వారికి.. కాంగ్రెస్ పార్టీ నాయకులకే మంజూరు అవుతున్నాయని ఆరోపించారు. అర్హులు తమకు ఇండ్లు మంజూరు కాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. యాచారం మండలం, చింతపట్ల గ్రామంలో అశోక్ అనే వ్యక్తి పేరు అర్హుల జాబితాలో పేరు ఉండి
.. ఇండ్ల కేటాయింపు సమయంలో అతడి పేరు లేకపోవడంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కేశంపేట : ఉండేందుకు ఇల్లులేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయాలి. మాకు ఇద్దరు కుమారులు. వారికి వివాహాలు అయ్యాయి. వారి భార్యలు, పిల్లలు ఉండేందుకు ఉన్న చిన్న గది సరిపోవడం లేదు. మట్టి గోడలతో ఉన్న ఇల్లు ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇంటి పై కప్పు రేకులపై కవర్ కప్పి భార్యాభర్తలం జీవిస్తున్నాం. కుమారులు, వారి పిల్లలు ఉండేందుకు చిన్న గది సరిపోకపోవ డంతో నందిగామ సమీపంలో ఇండ్లను అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి ఇల్లును మంజూరు చేయాలి.
– శిథిలావస్థకు చేరిన ఇంటివద్ద చంద్రయ్య