సిటీబ్యూరో, జులై 11 (నమస్తే తెలంగాణ): ఏనుగును చంపి దంతాలు తీశారా? చనిపోయిన ఏనుగు దంతాలు తెచ్చారా? ఇలా పలుకోణాల్లో రాచకొండ పోలీసులు ఏనుగు దంతాల ఘటనపై లోతైన విచారణ సాగిస్తున్నారు. శేషాచలం అడవుల్లో నుంచి ఏనుగు దంతాలు తెచ్చిన ఘటనలో అసలు కారణాలను రాచకొండ పోలీసులు అన్వేషిస్తున్నారు. గత నెల 25వ తేదీన హైదరాబాద్ శివారులో ఏనుగు దంతాలు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఎర్రచందనం స్మగ్లర్ అయిన రేకుల కుంట ప్రసాద్‌ను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు, హయత్‌నగర్ అటవీశాఖ అధికారులతో కలిసి పట్టుకున్న విషయం తెలిసిందే. నిందితుడి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో రూ. 3 కోట్ల విలువైన రెండు ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
శేషాచలం అడవుల్లోని గిరిజినుల నుంచి దంతాలు తెచ్చినట్లు నిందితుడు విచారణలో వెల్లడించాడు. వాళ్లకు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై కూడా దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా శేషాచలం అడవులకు వెళ్లి ఆరా తీసేందుకు సన్నాహాలు చేపట్టారు. అటవీశాఖ అదికారులు కూడా ఈ కేసు దర్యాప్తులో భాగస్వాములు కావడంతో పోలీసులు ఆటవీశాఖ అధికారులకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఒక బృందం శేషాచలం అడవులకు వెళ్లినట్లు తెలిసింది. పట్టుబడ్డ నిందితుడికి నేర చరిత్ర ఉండడంతో పాటు మరో నిందితుడు కూడా ఇతనికి సహకరించాడు.
పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడంతో పాటు ఏనుగు దంతాలు అమ్మిన వారెవరు, దీని వెనుక ఏదైనా ముఠా ఉందా? అనే విషయాలపై పోలీసులు దృష్టి పెట్టారు. శేషాచలం ఆడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుందనేది బహిరంగ రహస్యం. అయితే ఏనుగు దంతాల స్మగ్లింగ్ కూడా జరుగుతుందా? అనే విషయాన్ని ఇప్పుడు రాచకొండ పోలీసులు నిగ్గుతేల్చనున్నారు. ఇందుకు ఏపీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ కేసు దర్యాప్తును సాగిస్తున్నారు. ఇప్పటికే కొంత సమాచారాన్ని సేకరించిన పోలీసులు సేకరించి, ఆటవీశాఖ అధికారులకు అందజేశారు. అయితే మూలాల వరకు వెళ్లేనే ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తవుతుందని భావిస్తున్నారు. ఏనుగులను చంపి దంతాలు తీసుకొచ్చారా? అనే విషయంపైనే స్పష్టత కోసం దర్యాప్తు అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ ఘటనపై రెండు మూడు రోజుల్లోనే మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.