ECIL | చర్లపల్లి, మే 20 : ఎలక్ట్రానిక్స్ రంగంలో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)కు మినీరత్న హోదా దక్కింది. దీనిపై ఈసీఐఎల్ కంపెనీ అధికారులు, కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈసీఐఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ అనురాగ్ కుమార్ మాట్లాడుతూ.. కార్మికులు, అధికారులు సంస్థ కోసం అంకిత భావంతో పనిచేయడంతో ఈసీఐఎల్‌కు మినీరత్న హోదా లభించిందని అన్నారు.
ఆర్ధిక మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ ఎంటర్ప్రైజ్(డీపీఈ)విభాగం నిర్దేశించిన అర్హతను సాధించినందుకు భారత అణుశక్తి విభాగం ఈసీఐఎల్‌కు మినీరత్న కేటాగిరి1 హోదాను కల్పించిందని తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తూ రక్షణ రంగానికి కావల్సిన ఉత్పత్తులను అందిస్తున్నామని, మినీరత్న హోదాతో స్వయం ప్రతిపత్తిని సాధించడంతో పాటు దేశవ్యాప్తంగా ఈసీఐఎల్ ఖ్యాతి పెరిగిందని చెప్పారు. ఎలక్ట్రానిక్ రంగంలో మరిన్ని ఉత్పత్తులను సాధించేందుకు అధికారులు, కార్మికులు కృషి చేయాలని ఆయన సూచించారు.