విద్యుత్ శాఖ పనితీరు చూసి.. మండిపడ్డారు నగరవాసులు.. శుక్రవారం నగరంలో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది.. స్తంభాలు కూలడం.. తీగలు తెగిపోవడం..ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడం.. ఫీడర్ల ట్రిప్ వంటి సమస్యలతో పలు చోట్ల కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సకాలంలో స్పందించి పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అధికారులు..
కనీసం ప్రజల నుంచి ఫిర్యాదులపై కూడా స్పందించలేదు.. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉదయం వరకు..మరికొన్ని చోట్ల అసలు సరఫరానే పునరుద్ధరించలేదు.. ఎక్కడ విద్యుత్ సమస్యలు వచ్చినా.. 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండంటూ.. చెప్పినా.. ఆ నంబర్ అసలు పనిచేయడమే లేదని వినియోగదారులు మండిపడుతున్నారు. ఈ ఒక్క నంబరే కాదు.. ఎవరికీ ఫోన్ చేసినా.. ఫలితం లేకుండాపోయిందని వాపోయారు. ఒక్కరోజు వానకే పరిస్థితి ఇలా ఉంటే ఎలా.. అని సిటీజనం కరెంటోళ్లపై కస్సుబుస్సుమన్నారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): నగరంలో శుక్రవారం కురిసిన వర్షానికి, ఈదురుగాలులకు పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చాలాచోట్ల పునరుద్ధరణ పనుల్లో తీవ్రజాప్యం జరిగిందంటూ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖైరతాబాద్, నాంపల్లి, లంగర్‌హౌజ్, మలక్‌పేట, సరూర్‌నగర్ తదితర ప్రాంతాల్లో శనివారం ఉదయం కొన్నిచోట్ల, మధ్యాహ్నం వరకు మరికొన్నిచోట్ల విద్యుత్ పునరుద్ధరణే జరగలేదు. ఫీడర్లు ట్రిప్ అయిన చోట సైతం చాలా ఆలస్యంగా కరెంట్ వచ్చిందంటూ నగరవాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే ఒక్కరోజు వర్షానికి ఈ పరిస్థితే ఇలా ఉందంటే నెలరోజుల కాలంలో ఇలా వర్షాలు కురవడం మూడోసారి. ఈనెల మొదటివారంలో ఒక సబ్‌స్టేషన్‌లో ఎఫ్ఓసీ ఆపరేటర్ వినియోగదారుడితో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆ ఉద్యోగికి సీఎండీ ముషారఫ్ మెమో ఇవ్వగా, మరో చోట మద్యం మత్తులో అసలు వినియోగదారుల ఫోన్లే ఎత్తని ఉద్యోగిని సస్పెండ్ చేశారు. శుక్రవారం ఓ ఏరియాలో విద్యుత్ పునరుర్ధరించాలంటూ లైన్మెన్కు ఫోన్ చేస్తే రూ.500 ఇస్తే వచ్చి సెట్ చేస్తానని చెప్పాడని ఒక వినియోగదారుడు సీఎండీకి సోషల్‌మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు.
ఫ్యూజ్ ఆఫ్ కాల్ సెంటర్ల పనితీరు అధ్వానంగా ఉంది. ఇక టోల్‌ఫ్రీ కేవలం చెప్పుకోవడానికే పరిమితమైంది. ఉన్నతాధికారులు మాత్రం తాము ఎక్కడి నుంచి ఫిర్యాదులొచ్చినా ంటనే స్పందిస్తున్నామని చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. శుక్రవారం ఒక్కరోజే సుమారుగా 300కు పైగా ఫిర్యాదులొచ్చాయని విద్యుత్ సిబ్బంది చెప్పారు. వీటికి సంబంధించి పరిష్కారం విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు ప్రయత్నించినా కొన్ని ఫిర్యాదులు ఆలస్యంగా పరిష్కరించామని, మరికొన్నింటికి టైం పడుతుందని వారు పేర్కొన్నారు.
ఎక్కడ విద్యుత్ సమస్యలు తలెత్తినా వెంటనే 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండంటూ బాకా ఊదిన విద్యుత్ అధికారులు.. ఆ నంబర్ పనిచేస్తుందా చేయట్లేదా అనే అంశంపై దృష్టి పెట్టడం లేదు. తమ ఏరియాల్లో కరెంట్ పోయినప్పుడు వెంటనే కాల్ చేయండంటూ ఇచ్చిన ఎఫ్ఓసీ నంబర్లు దాదాపు స్విచ్ఛాఫ్ ఉంటున్నాయి. అకాల వర్షం పడితే, అకస్మాతుగా కరెంట్ పోతే వెంటనే తమకు కాల్ చేయాలని డీఈలు ఇచ్చిన నంబర్లే పనిచేయడం లేదంటే ఎస్పీడీసీఎల్ నిర్వహణ ఎంత దారుణంగా ఉందో చూడాలని వినియోగదారులు అంటున్నారు.
రాత్రంతా కరెంట్ లేకపోవడంతో సరూర్‌నగర్ కంట్రోల్ రూంకు కాల్ చేశాం. వారు సబ్‌స్టేషన్ నంబర్ ఇచ్చారు. వారికి కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుంది. లైన్మెన్ నంబర్‌కు చేస్తే మేము వేరే దగ్గర పనిలో ఉన్నాం.. అని చెబుతున్నారు. వర్షం పడినప్పుడు కంటే ఆగిపోయిన తర్వాత విద్యుత్ కోతలు ఇబ్బంది పెడుతున్నాయి. 1912కు కాల్ చేస్తే అసలు రెస్పాన్స్ లేదు.
– ప్రణీత్ రెడ్డి, సరూర్‌నగర్
మా ఏరియాలో గంటల తరబడి కరెంట్ పోతుందని 1912 కు కాల్చేశాం. కానీ కాల్ మొదట్లోనే కట్ అయిపోతుంది. అకాల వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతే వెంటనే తమకు సమాచారమివ్వాలని విద్యుత్ అధికారులు ఎఫ్ఓసీ నంబర్లు ఇచ్చారు. 9490619806 నంబర్‌కు కాల్చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుంది. రాత్రంతా కరెంట్ లేక జాగారం చేశాం. కానీ విద్యుత్ సిబ్బంది ఎవరూ స్పందించలేదు.
– యాకుబ్, జహనామా ప్రాంతవాసి