SPDCL | సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): విద్యుత్ శాఖలో అవినీతిని సమూలంగా అంతం చేయాలని ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఉండటం లేదు. శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు అవసరమైన విద్యుత్ నెట్ వర్క్ ఏర్పాటు చేయడంలో సెక్షన్ స్థాయి అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారు.
విద్యుత్ శాఖలో అవినీతి మితిమీరిన స్థాయికి చేరిందని, దాన్ని అరికట్టేందుకు ఇటీవల టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయంలోనే అవినీతి ఫిర్యాదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పైగా ప్రతి సర్కిల్, డివిజన్, సెక్షన్ కార్యాలయంలోనూ ప్రత్యేకంగా స్టిక్కర్లు అంటించినా ప్రయోజనం లేకుండా పోతున్నది. విద్యుత్ శాఖలో ఇప్పటి వరకు ఉన్నతాధికారులు మొదలుకొని.. కింది స్థాయి ఉద్యోగుల వరకు పదుల సంఖ్యలో ఏసీబీ అధికారుల వలకు చిక్కినా.. కొందరు అధికారులు, సిబ్బంది తీరు మారడం లేదు.
సాధారణంగా నగరంలో అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టులు, కార్యాలయాల భవనాల్లో విద్యుత్ సరఫరాకు సంబంధించిన బిల్డర్లే తమ ప్రాంగణంలోనే ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఇటీవల నగర శివారు ప్రాంతంలో ఓ గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ను రోడ్డు వెంబడి ఫుట్‌పాత్‌పై ఏర్పాటు చేయడంతో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
ఫిర్యాదులు రావడంతో విద్యుత్ శాఖ అధికారులకు ఇష్టం లేకపోయినా కొత్తగా ఏర్పాటు చేసినా ట్రాన్స్ఫార్మర్ను తొలగించాల్సి వచ్చింది. ఈ విషయంలో సంబంధిత గేటెడ్ కమ్యూనిటీ నిర్మించిన రియల్ ఎస్టేట్ సంస్థకు మేలు చేసేలా సెక్షన్ అధికారులు వ్యవహరించి, అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. ఇలాంటి వ్యవహారాలు శివారు ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంటున్నాయని, నిబంధనల ప్రకారం విద్యుత్ నెట్ వర్క్‌ను ఏర్పాటు చేయకుండా, రియల్ ఎస్టేట్ బిల్డర్లకు అనుకూలంగా విద్యుత్ శాఖ సిబ్బంది వ్యవహరిస్తూ లక్షలు దండుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిని మినహాయిస్తే శివారులో మున్సిపాలిటీల్లో చాలా వరకు జీపీ లేఅవుట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆయా జీపీ లేఅవుట్లలో ఇండ్ల నిర్మాణాలు జరుగుతుండడంతో వాటి కోసం నిబంధనలకు పరిగణలోకి తీసుకోకుండానే విద్యుత్ లైన్లను, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా సంస్థకు ఆదాయం వస్తుందని చెప్పి.. లే అవుట్లో ఇష్టారాజ్యంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. అనధికారికంగా చేసిన లేఅవుట్లలో చాలా చోట్ల రోడ్ల వెడల్పు 30 అడుగుల కంటే తక్కువగా ఉన్నా.. అదే రోడ్లపైనే ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తూ, విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్నారు. జీపీ లేఅవుట్లలో పార్కు స్థలాలు, సామాజిక అవసరాల కోసం కేటాయించిన 10 శాతం స్థలం మచ్చుకైనా కనిపించదు. ఇలాంటి చోట విద్యుత్ శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.