సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): వేసవిలో ఎండల తీవ్రతతో ఉక్కపోతతో ఇబ్బందులు పడటం సాధారణమే అయినా.. అలాంటి పరిస్థితి ఇప్పుడు వర్షాకాలంలోనూ కనిపిస్తున్నది. ఒకవైపు వర్షాలు కురుస్తున్నా.. మరోవైపు ఉక్కపోతతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. నిరంతరం ఫ్యాన్లు, ఏసీలు లేనిదే ఉండలేకపోతున్నామని నగరవాసులు వాపోతున్నారు.
ఆగస్టు నెలలోనే వరసగా వర్షాలు కురుస్తున్నా.. మధ్యలో ఉక్కపోత ఎక్కువ ఉండటంతో విద్యుత్ వినియోగం సైతం ఒక్కసారిగా పెరిగింది. ఆగస్టు 4న గ్రేటర్లో 60.3 మిలియన్ యూనిట్ల వినియోగం ఉండగా, ఆగస్టు 14న 72.8 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. ఈ పది రోజుల వ్యవధిలోనే సుమారు 12 మిలియన్ యూనిట్ల దాకా పెరిగింది. పైగా ఇదే నెలలో అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీలుగా నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా వర్షాకాలంలో 30 డిగ్రీల లోపే ఉంటుంది. ఉష్ణోగ్రత పెరగడానికి ప్రధాన కారణం ఉపరితల ఆవర్తనమని అధికారులు పేర్కొంటున్నారు.