సిటీబ్యూరో: గ్రేటర్లో విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్పీడీసీఎల్ పెద్ద ఎత్తున షాక్ ఇవ్వనున్నది. ఒకవైపు చార్జీలు పెంచమని చెబుతూనే.. నిబంధనల పేరుతో సరికొత్త మార్గాల్లో వినియోగదారులపై ఆర్థికభారం పడేలా చేస్తోంది. గ్రేటర్లో మొత్తం 62 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 52 లక్షల వరకు డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి. భవన నిర్మాణాల సమయంలో అధికారులు టెంపరరీ కనెక్షన్లు ఇచ్చి నిర్మాణం పూర్తయిన తరవాత వాటిని రెగ్యులరైజ్ చేయడం డిస్కంలో సహజంగా జరుగుతుంది. వినియోగదారులు దరఖాస్తు చేసుకోగానే మూడు రోజుల్లో ఏఈ క్షేత్రస్థాయి విచారణ జరిపి టెంపరరీ కనెక్షన్‌ను రెగ్యులరైజ్ చేస్తారు.
ఈ ప్రక్రియ కూడా ప్రస్తుతం ఆలస్యంగానే జరుగుతుండగా.. తాజాగా ఎస్పీడీసీఎల్ తీసుకుంటున్న నిర్ణయం వినియోగదారులపై పెద్ద ఎత్తున ఆర్థిక భారం మోపనున్నది. గ్రేటర్లో మూడంతస్తుల నుంచి ముప్పై అంతస్తుల వరకు ఇండ్లు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి కొన్ని ఫ్లోర్ల వరకే అనుమతులు ఉన్నాయి. ఇండ్లకు కనెక్షన్లు ఇచ్చే సమయంలో ఆక్యుపెన్సీ విషయాన్ని విద్యుత్ సిబ్బంది పట్టించుకోకపోవడం వల్ల ఇప్పటికిప్పుడు ఈ భారం వినియోగదారులపై పడుతున్నది. కాగా, జీహెచ్ఎంసీ, మున్సిపల్ పరిధిలో ఉన్న ఇండ్లలో ఎన్నింటికీ పర్మిషన్లు ఉన్నాయి..
అందులో ఎన్ని అంతస్తులకు పర్మిషన్లు ఉన్నాయి.. ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి. అందులో ఎన్ని కనెక్షన్లు టెంపరరీగా మార్చవచ్చనే దిశగా క్షేత్రస్థాయిలో ఎస్పీడీసీఎల్ సిబ్బంది ఆరా తీస్తున్నారు. ఆక్యుపెన్సీ లేకుండా ఇచ్చిన కనెక్షన్లకు నోటీసులు ఇచ్చి వాటిని టెంపరరీలోకి మార్చడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రభావం గ్రేటర్లో సుమారుగా 8 నుంచి 10 లక్షల మంది విద్యుత్ వినియోగదారులపై పడనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వీరి కనెక్షన్లు రెగ్యులర్ నుంచి టెంపరరీ కేటగిరీ మారితే యూనిట్ రేట్ పెరుగుతుంది. ప్రస్తుతం యూనిట్ ధర రూ.5 ఉండగా.. టెంపరరీలో యూనిట్ ధర రూ.11పైనే భారం పడుతుందని అంచనా.
సమ్మర్లో మరింత ఎక్కువ..
వేసవిలో విద్యుత్ వినియోగం పెరగనున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం డిమాండ్ విపరీతంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో సాధారణంగా వచ్చే బిల్లే పెరిగితే కేటగిరీ మార్చి యూనిట్‌కు రెండు నుంచి మూడురెట్ల చార్జీ చేస్తే వినియోగదారుడి పరిస్థితి ఏంటనేది ప్రశ్న. ఈ కేటగిరీలకు సంబంధించి ఎవరైనా ప్రశ్నించాలనుకున్నా వారికి రెగ్యులరైజ్ చేసుకోమన్న సమాధానమే వస్తుందట. తమ మీటర్ టెంపరరీ కేటగిరీ నుంచి రెగ్యులరైజ్ చేయమని ఏఈ, డీఈల దగ్గరికి వెళ్తే కార్పొరేట్ ఆఫీస్ వరకు వెళ్లాల్సి వస్తుందని వినియోగదారులు అంటున్నారు. కేటగిరీ మార్పు విషయంలో గత ప్రభుత్వంలో వారం రోజుల్లోపే పనులు జరిగితే ఇప్పుడు మాత్రం మూడు నాలుగు నెలలైనా మార్చడం లేదని, తమపై బిల్లుల భారం ఎక్కువవుతున్నదని చెప్పారు. తాజాగా డిస్కం తీసుకుంటున్న నిర్ణయంతో 10 లక్షల మంది వినియోగదారులపై ఆర్థికభారం అధికంగా పడడమే కాకుండా వారికి ఈ మూడు నెలల పాటు రెగ్యులరైజ్ చేయించుకునేందుకు కూడా అధికారులు, సిబ్బంది సహకరించరన్న విమర్శలు వినిపిస్తున్నాయి.